Share News

Telangana Irrigation Promotions: నీటిపారుదల శాఖలో 33 ఏళ్ల తర్వాత శాశ్వత పదోన్నతులు

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:29 AM

నీటిపారుదలశాఖలో శాశ్వత ప్రాతిపదికన అధికారులకు ప్రమోషన్లు..

Telangana Irrigation Promotions: నీటిపారుదల శాఖలో 33 ఏళ్ల తర్వాత శాశ్వత పదోన్నతులు
Telangana Irrigation Promotions

  • ఐదుగురికి ఈఎన్‌సీలుగా, 14 మందికి సీఈలుగా, 127 మందికి డీఈఈలుగా ప్రమోషన్‌

  • ఫలించిన మంత్రి ఉత్తమ్‌ చొరవ.. త్వరలో ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదలశాఖలో శాశ్వత ప్రాతిపదికన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడానికి శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) ఆమోదం తెలిపింది. 33 ఏళ్ల అనంతరం శాశ్వత పదోన్నతుల ప్రక్రియను చేపట్టడం విశేషం. మంగళవారం సచివాలయంలో రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఇన్‌ఛార్జ్‌ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా నేతృత్వంలో డీపీసీ సమావేశమయింది. చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) నుంచి ఈఎన్‌సీ(ఇంజనీర్‌ ఇన్‌చీఫ్)లుగా 5 మందికి, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌(ఎస్ఈ) నుంచి చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ)లుగా 14 మందికి, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(డీఈఈ)లుగా 127 మందికి పదోన్నతులు కల్పించడానికి ఈ కమిటీ ఆమోదం తెలిపింది. త్వరలోనే పదోన్నతులు కల్పించి, పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉద్యోగ విరమణ చేసినవారి పదవీకాలం పొడిగింపు కారణంగా తరువాత స్థానాల్లో ఉన్నవారికి ఇంతవరకు పదోన్నతులు రాలేదు. సర్వీసు వివాదాల కారణంగా చాలా మందికి తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు అందాయి. తాజాగా సర్వీసు వివాదాలు సమసిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసులతో షోకాజు నోటీసులు జారీ చేయడంతో పదోన్నతులకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇవికాకుండా మరో వారం రోజుల్లోపు 45దాకా ఖాళీగా ఉన్న ఎస్‌ఈ పోస్టులను, 70 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ప్రమోషన్ల ప్రక్రియ సాధ్యమయిందని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ శాశ్వత పాత్రిపదికన భర్తీ చేయాలని ఆయన ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. సర్వీసు వివాదంపై న్యాయస్థానంలో నడుస్తున్న కేసు విషయంపై అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)తో చర్చించారు. కోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో పదోన్నతులకు మార్గం సుగమమయంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:29 AM