Hyderabad Food Poisoning: ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారం తిని ఆస్పత్రిపాలు!
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:20 AM
ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారాన్ని వేడి చేసుకుని తిని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆస్పత్రి ..
ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి తీవ్ర అస్వస్థత
ఒకరి మృతి.. మిగిలిన వారికి కొనసాగుతున్న చికిత్స
ముగ్గురి పరిస్థితి విషమం.. మృతుడు ఆర్టీసీ కండక్టర్
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విషాదం
వనస్థలిపురం, జూలై 22(ఆంధ్ర జ్యోతి): ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారాన్ని వేడి చేసుకుని తిని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఫలక్‌నుమా ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ యాదవ్(46) తన భార్య రజిత(38), కుమార్తెలు జస్మిత(15), లహరి(17)తో కలిసి వనస్థలిపురం చింతలకుంటలోని ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నారు. రజిత సోదరుడు సంతోష్ కుమార్(39), భార్య రాధిక(34), కుమార్తెలు పూర్విక (12), క్రితగ్న(7), శ్రీనివా్‌సయాదవ్ తల్లి గౌరమ్మ(65) బోనాల సందర్భంగా జూన్ 20, ఆదివారం శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వచ్చారు. పండగ నేపథ్యంలో శ్రీనివాస్ యాదవ్ తెచ్చిన చికెన్, మటన్, బోటీని కుటుంబసభ్యులు తొమ్మిది మంది తిన్నారు. మిగిలిన మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు. సోమవారం ఉదయం అదే మాంసాహారాన్ని వేడి చేసుకుని మళ్లీ తిన్నారు. అనంతరం అందరూ వాంతులు, విరేచనాలతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం సాయంత్రానికి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. బాధితులందరి బీపీ(రక్తపోటు) పడిపోవడంతో అందరినీ ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కానీ, శ్రీనివాస్ యాదవ్ చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతుండగా.. శ్రీనివాస్ తల్లి గౌరమ్మ, భార్య రజిత, కుమార్తె జస్మిత పరిస్థితి విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తేనే బాధితుల పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి