Share News

Nalgonda: ఒక దోషి.. 2 ఉరి శిక్షలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:12 AM

మైనర్‌ బాలికపై లైంగిక దాడి చేసి ఆమెను హత్య చేసిన కేసులో దోషికి మరణ దండన, రూ.1.10 లక్షల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ప్రకటించింది.

Nalgonda: ఒక దోషి.. 2 ఉరి శిక్షలు

  • మరణించే వరకు అమలు చేయాలి

  • హత్య, అత్యాచార నేరానికి ఐపీసీ, పోక్సో చట్టాల ప్రకారం ఉరి

  • సాక్ష్యాధారాలు నాశనం చేసినందుకు ఐపీసీ ప్రకారం ఏడేళ్ల కారాగారం

  • రూ.1.10 లక్షల జరిమానా కూడా

  • సంచలన తీర్పు వెల్లడించిన నల్లగొండ జిల్లా న్యాయస్థానం

నల్లగొండ క్రైం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మైనర్‌ బాలికపై లైంగిక దాడి చేసి ఆమెను హత్య చేసిన కేసులో దోషికి మరణ దండన, రూ.1.10 లక్షల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ప్రకటించింది. ఐపీసీ, పోక్సో చట్టాల ప్రకారం రెండు ఉరి శిక్షలు, సాక్ష్యాధారాలను నాశనం చేసినందుకు ఐపీసీ ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష వేస్తూ నల్లగొండ రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు, అత్యాచార, పోక్సో చట్టం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌. రోజారమణి గురువారం తీర్పు వెల్లడించారు. ఈ కేసును తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ‘రెండు ఉరి శిక్షలు’ వేస్తున్నట్లుగా తీర్పులో పేర్కొన్నారు. నల్లగొండ పట్టణానికి చెందిన మహ్మద్‌ ముకర్రం మాంసం దుకాణంలో పని చేసేవాడు. 2013 ఏప్రిల్‌ 28న మహ్మద్‌ ముకర్రం అదే ప్రాంతానికి చెందిన బాలిక పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చున్నీతోనే ఉరివేసి చంపి, మృతదేహాన్ని పక్కనే ఉన్న డ్రైనేజీ కాల్వలో పడవేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని మూడు రోజుల తర్వాత నాలాలో గుర్తించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అన్ని సాక్ష్యాధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నిందితుడిపై పోక్సో, ఐపీసీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడు నేరానికి పాల్పడ్డాడని, శిక్షకు అర్హుడిగా నిర్ధారించి నల్లగొండ జిల్లా న్యాయస్థానం గురువారం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. హత్య చేసినందుకు దోషి మహ్మద్‌ ముకర్రంకు ఐపీసీ ప్రకారం ఉరి శిక్ష (మరణించే వరకు మెడకు ఉరి), రూ.50 వేల జరిమానా విధించారు. ఆ జరిమానా చెల్లించకపోతే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష విధించారు. అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం ప్రకారం ఉరి శిక్ష (మరణించే వరకు మెడకు ఉరి), రూ.50 వేల జరిమానా, జరిమానా చెల్లించకపోతే ఆరు నెలల జైలుశిక్ష విధించారు. ఆధారాలు నాశనం చేసినందుకు ఐపీసీ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, చెల్లించకపోతే ఆరు నెలలు అదనంగా జైలుశిక్ష విధించారు. బాధితురాలి తల్లికి జిల్లా న్యాయసేవా సహకార సంస్థ ద్వారా రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు.


ఎంతటి వారికైనా శిక్ష తప్పదు: శరత్‌చంద్ర పవార్‌, నల్లగొండ జిల్లా ఎస్పీ

తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోక్సో కేసుల్లో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని చెప్పారు. బాలికపై లైంగికదాడి, హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసి శిక్ష పడేలా చేసిన పోలీస్‌ అధికారులతో పాటు ప్రభుత్వ న్యాయవాదులను ఎస్పీ అభినందించడంతో పాటు సన్మానించారు. అదేవిధంగా నిందితుడికి ఉరి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులకు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 04:12 AM