Share News

Uttam Kumar Reddy: కాళేశ్వరం బాధ్యుల్ని వదలం

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:56 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కార కులెవ రైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అది మాజీ సీఎం కేసీఆర్‌ అయినా, మాజీ మంత్రి హరీశ్‌రావైనా, అధికారులైనా తప్పక చర్యలుంటాయన్నారు.

Uttam Kumar Reddy: కాళేశ్వరం బాధ్యుల్ని వదలం

  • కేసీఆర్‌ అయినా.. అధికారులైనా.. ఎవరైనా చర్యలు తప్పవు

  • ఎన్‌డీఎ్‌సఏ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం

  • బ్యారేజీలను రిజర్వాయర్లుగా వినియోగించినందునే విఫలం

  • తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యతపై తప్పుడు ప్రచారం: మంత్రి ఉత్తమ్‌

  • బ్యారేజీల వైఫల్యంపై మంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కార కులెవ రైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అది మాజీ సీఎం కేసీఆర్‌ అయినా, మాజీ మంత్రి హరీశ్‌రావైనా, అధికారులైనా తప్పక చర్యలుంటాయన్నారు. రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మించి, దానిని ముంచి.. తెలంగాణకు తీరని నష్టం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్యారేజీల వైఫల్యంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పిదాలపై మంగళవారం సచివాలయంలో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఆధారంగా మంత్రి ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ చేసింది మీరే.. కట్టింది మీరే. అది కూలింది మీరు అధికారంలో ఉన్నప్పుడే.. ఎన్‌డీఎ్‌సఏ ప్రాథమిక నివేదిక వచ్చిందీ అప్పుడే’’ అని బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్‌డీఎ్‌సఏ చట్టానికి పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపిందని, ఇప్పుడు ఆ చట్టం ఆధారంగా ఏర్పడిన నిపుణుల కమిటీని కించపరిచేలా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


సీతారామ ప్రాజెక్టుకు అనుమతివ్వాలని కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శిని తాము కోరితే.. కాళేశ్వరం ప్రాజెక్టు డి జైన్లను నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ఆమోదించినా బ్యారేజీ విఫలమైందంటూ బదులిచ్చారని అన్నారు. తెలంగాణ పేరు ప్రతిష్ఠలను గత ప్రభుత్వం మంట కలిపిందని ధ్వజమెత్తారు. 2019లో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి ఏడాదే వరదలకు దెబ్బతిన్నాయని, అయినా కనీస మరమ్మతులు కూడా చేయలేదని ఆక్షేపించారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం)తోపాటు బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వలే దని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. బ్యారేజీలు పూర్తయినా.. కాఫర్‌ డ్యామ్‌ అవశేషాలను అలాగే వదిలిపెట్టారని, తెలంగాణ ఇంజనీరింగ్‌ రిసేర్చ్‌ ల్యాబోరేటరీ నివేదికలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కోసం ఒక చోట జియో టెక్నికల్‌/ఫిజికల్‌ పరీక్షలు చేసి, మరోచోట నిర్మాణానికి నిర్ణయాలు తీసుకున్నారని ఆక్షేపించారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం వద్దని ఐదుగురు మాజీ ఇంజనీర్లు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని, నిర్మాణం ప్రారంభించిన ఆర్నెల్లకు ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించారని అన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా.. లేదంటూ తప్పుడు ప్రచారం చేసి బ్యారేజీని తరలించారని ఆరోపించారు. బ్యారేజీలను రిజర్వాయర్‌లుగా వినియోగించడంతో.. ఆ ఒత్తిడి పునాదులపై పడిందని, వాటి కింద ఇసుక జారి.. బ్యారేజీలు విఫలమయ్యాయని తెలిపారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ గడువు పెంపు

  • మే 31 వరకు పొడగిస్తూ జీవో జారీ

కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ కోసం వేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు విధించిన గడువు ఈనెల 30(బుధవారం)తో ముగియనుంది. నివేదిక సమర్పించడానికి మరో నెల గడువు ఇవ్వాలని ఘోష్‌ కమిషన్‌ కోరడంతో ఆ మేరకు గడువు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా మంగళవారం జీవోనెం.17ను జారీ చేశారు. మరోవైపు కాళేశ్వరం విచారణలో భాగంగా ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ను కమిషన్‌ చైర్మన్‌ చంద్రఘోష్‌ కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక అందించాలని ఈఎన్‌సీ(జనరల్‌)ను జస్టిస్‌ ఘోష్‌ కోరగా.. త్వరలోనే అందజేస్తామని అనిల్‌కుమార్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 03:56 AM