Share News

Telangana High Court: యూజీసీ మార్గదర్శకాలపై తక్షణమే స్టే ఇవ్వలేం

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:51 AM

డీమ్డ్ యూనివర్సిటీలపై యూజీసీ మార్గదర్శకాలపై తక్షణ స్టేను హైకోర్టు నిరాకరించింది. హోదా అనుమతి తుది తీర్పుకు లోబడే ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ.

Telangana High Court: యూజీసీ మార్గదర్శకాలపై తక్షణమే స్టే ఇవ్వలేం

  • మా తుది తీర్పునకు లోబడే డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా

  • హోదా ఇచ్చే ముందే కొత్త డీమ్డ్‌ వర్సిటీలకు యూజీసీ ఈ విషయం చెప్పాలి: హైకోర్టు

  • దుకాణాలు, షెడ్లలో కాలేజీలు పెట్టి.. డీమ్డ్‌ హోదా అడుగుతున్నారు

  • కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు

  • విచారణ జూలై 30కి వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): డీమ్డ్‌ యూనివర్సిటీలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలపై తక్షణమే స్టే ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే అనుమతి పొందిన, భవిష్యత్తులో అనుమతి ఇచ్చే కాలేజీలకు.. డీమ్డ్‌ హోదా అనేది తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్తగా డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా ఇచ్చే ముందే ఈ విషయాన్ని ఆయా కాలేజీలకు యూజీసీ స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఆ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమంటూ..

ప్రైవేటు కాలేజీలకు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా అనుమతి ఇచ్చేందుకు ఉద్దేశించిన పలు నిబంధనల్లో యూజీసీ ఏడాదిన్నర క్రితం పలు మార్పులు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు (ఇనిస్టిట్యూషన్స్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీస్‌ రెగ్యులేషన్స్‌-2013) జారీ చేసింది. అయితే ఇందులోని 2 (15), 6, 7, 8, 29, 30 నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమని, వాటిని కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 11న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను దెబ్బకొట్టేలా, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేకుండా చేసేలా నూతన మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొన్నారు. 60 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాకపోతే.. అనుమతి వచ్చినట్లే భావించాలనడం అక్రమమని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ‘విద్య’ అనేది రాష్ట్ర జాబితాలోని అంశమని, ఇలా మార్గదర్శకాలు జారీ చేసే అర్హత యూజీసీకి లేదని పేర్కొన్నారు. చిన్న చిన్న దుకాణాలు, షెడ్లలో కాలేజీలు పెట్టి డీమ్డ్‌ హోదా కోసం ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఇప్పటికే డీమ్డ్‌ హోదా పొందిన ఓ విద్యా సంస్థ న్యాట్‌ ఉత్తమ ర్యాంకు కోసం మోసానికి పాల్పడటంపై సీబీఐ విచారణ ఎదుర్కొంటోందని గుర్తుచేశారు. అలాంటి డీమ్డ్‌ యూనివర్సిటీలు భవిష్యత్తులో మూతపడితే విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు జవాబుదారీ అని ప్రశ్నించారు. యూజీసీ మార్గదర్శకాలపై స్టే ఇవ్వాలని కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నర్సింహశర్మ వాదిస్తూ.. యూజీసీ కొత్త మార్గదర్శకాలకు చట్టబద్ధమైన హోదా ఉందని పేర్కొన్నారు. అవి న్యాయ విరుద్ధమని తుది తీర్పు ద్వారా ప్రకటిస్తే తప్ప అమలును అడ్డుకోలేమని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తక్షణమే స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 04:51 AM