Telangana High Court: హైకోర్టును నడిపించేది సీజే ఒక్కరే కాదు
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:31 AM
హైకోర్టును నడిపించేది ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే అన్న తప్పుడు అభిప్రాయం తనకు లేదని నూతన చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ చెప్పారు.
అందరి కృషితోనే న్యాయం: చీఫ్ జస్టిస్ ఏకే సింగ్
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): హైకోర్టును నడిపించేది ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే అన్న తప్పుడు అభిప్రాయం తనకు లేదని నూతన చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ చెప్పారు. అందరి సహకారంతో న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. న్యాయవాదులు లేకుండా న్యాయం లేదని, వారి వల్లే బాధితులకు న్యాయం అందుతుందని పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సింహభాగం బార్ నుంచి వచ్చిన వారేనని గుర్తుచేశారు. తెలంగాణ హైకోర్టు ఏడో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఏకే సింగ్‌ను శుక్రవారం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో అందరూ యజమానులేనని చెప్పారు. న్యాయవాదులు, రిజిస్ట్రీ సభ్యులు, ఇతర సిబ్బందికి తగిన గౌరవం ఉంటుందని, అంతా తన అన్నదమ్ములని ఉద్ఘాటించారు. అత్యంత జూనియర్ న్యాయవాది నుంచి అత్యంత సీనియర్ న్యాయవాది వరకు అందరినీ సమాన భావనతో చూస్తానని తెలిపారు. భయం, పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా న్యాయం అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, కార్యదర్శులు విజారత్ అలీ, ఇంద్రసేనారెడ్డి, బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సునీల్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News