Share News

Building Construction: నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక ఉంటేనే.. ఇకపై భవనాలకు అనుమతుల జారీ!

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:33 AM

రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల జారీలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిర్ణీత నిర్మాణ విస్తీర్ణం దాటిన భవనాలకు సంబంధించి నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక కూడా తప్పనిసరి కానుంది.

Building Construction: నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక ఉంటేనే.. ఇకపై భవనాలకు అనుమతుల జారీ!

  • నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్‌తో పర్యావరణానికి హాని.. చెరువులు, నాలాల ఆక్రమణ

  • అడ్డుకునేలా కేంద్రం కొత్త నిబంధనలు

  • మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు

  • వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి..

హైదరాబాద్‌ సిటీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల జారీలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిర్ణీత నిర్మాణ విస్తీర్ణం దాటిన భవనాలకు సంబంధించి నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక కూడా తప్పనిసరి కానుంది. భవనం ప్లాన్‌తోపాటు నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఎంతమేర వ్యర్థాలు వెలువడే అవకాశముంది? వాటిని ఎక్కడికి తరలిస్తారు? ఎలా వినియోగించుకుంటారు? లేదా ఎవరికైనా అప్పగిస్తారా? అన్న వివరాలతో ప్రణాళిక సమర్పించాల్సి ఉంటుంది. నిర్మాణ వ్యర్థాలతో పర్యావరణంపై ప్రభావం పడటంతోపాటు అక్రమ డంపింగ్‌తో చెరువులు, నాలాల ఆక్రమణలకు దారితీస్తున్న పరిస్థితుల్లో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖల ఆదేశాల మేరకు.. పురపాలక శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు.


‘ఆక్యుపెన్సీ’తో లింకు?

నిర్మాణ సమయంలో వెలువడే సిమెంట్‌, ఇసుక, ఇటుకల ముక్కలు, రాళ్లు, కాంక్రీట్‌, టైల్స్‌, సెరామిక్‌ తదితర వ్యర్థాలను సాధారణ బిల్డర్లతోపాటు ప్రముఖ సంస్థలు కూడా చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన అక్రమంగా డంప్‌ చేస్తున్నాయి. క్రమంగా చెరువులు, నాలాలు పూడుకుపోయి ఆక్రమణలు సులువు అవుతున్నాయి. పర్యావరణంపైనా ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే కొత్త నిబంధన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 20 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. అందులో నిర్మాణరంగ వ్యర్థాల నిర్వహణ అంశమూ ఉంది. ఇకపై తక్కువ విస్తీర్ణమున్నా ఈ నిబంధన వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఎంత స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక భవన నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చే నివాసయోగ్య పత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌)కు నిర్మాణ వ్యర్థాల నిర్వహణనూ ముడిపెట్టనున్నారు. నిర్మాణ వ్యర్థాలు తీసుకెళ్లిన ఏజెన్సీ నుంచి సంబంధిత పత్రాలు తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. ఇక పాత నిర్మాణాలు కూల్చి కొత్త భవనాలు నిర్మించాలనుకుంటే.. పాత నిర్మాణాల వ్యర్థాలకు సంబంధించి ఏజెన్సీల సర్టిఫికెట్‌ సమర్పించాలి.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 06:05 AM