NEET UG 2025: ఘాటుగా నీట్
ABN , Publish Date - May 05 , 2025 | 03:38 AM
పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో అభ్యర్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసివేయించారు. ఎప్పటిలాగానే.. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను కచ్చితంగా అమలు చేశారు.
విద్యార్థుల్ని బెంబేలెత్తించిన ఫిజిక్స్ ప్రశ్నలు
45 ప్రశ్నలకుగాను 25 రాస్తే గొప్పే
మిగతా సబ్జెక్టుల్లోనూ కష్టమైన ప్రశ్నలే
450 స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీటు!
గడియారాలు లేక.. సమయం తెలియక ఇబ్బందిపడ్డ విద్యార్థులు.. 95% హాజరు
జూన్ 14న ఫలితాలు.. నెలాఖరులోగా కీ
హైదరాబాద్, కరీంనగర్, కీసర, పహాడీషరీఫ్, మే 4 (ఆంధ్రజ్యోతి): భౌతిక శాస్త్రంలో 16 ప్రశ్నలు బెంబేలెత్తించాయి! రసాయన శాస్త్రంలో 15 ప్రశ్నలు బెదరగొట్టాయి!! బోటనీలో 14, జువాలజీలో ఆరు ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయి! ఒక్కమాటలో చెప్పాలంటే.. వైద్య విద్యలో ప్రవేశాల నిమిత్తం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్-యూజీ 2025) ప్రశ్నపత్రం ఘాటుగా, అత్యంత కఠినంగా ఉంది! రాష్ట్రంలో 190 పరీక్ష కేంద్రాల్లో జరిగిన నీట్ పరీక్షకు 95 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో అభ్యర్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసివేయించారు. ఎప్పటిలాగానే.. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను కచ్చితంగా అమలు చేశారు. రకరకాల కారణాల వల్ల సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. లోపలికి అనుమతించాలంటూ సిబ్బందిని బతిమిలాడుకున్నా ఉపయోగం లేకపోయింది. దీంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. కరీంనగర్‌లోని మహిళల డిగ్రీ, పీజీ కాలేజీలో నీట్ పరీక్ష రాసేందుకు ఒక విద్యార్థిని వేములవాడ నుంచి తన తల్లితో కలిసి వచ్చింది. కానీ.. ఆమె మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు.
కూలీ పని చేసి, పుస్తెలతాడు తాకట్టుపెట్టి అప్పు తీసుకొని తన కుమార్తెకు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించానని.. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయింది. ఇటువంటి ఘటనలు అక్కడక్కడ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో నీట్ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు.. హాల్ టికెట్‌లో ఆ కేంద్రం పేరు ఒకలా, అక్కడ మరొకలా ఉండడంతో అయోమయానికి గురయ్యారు. అక్కడ గతంలో మూర్తి ఇంజనీరింగ్ కళాశాల ఉండేది. గత ప్రభుత్వ హయాంలో ఆ కాలేజీని అద్దెకు తీసుకుని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లలో ఆ కేంద్రం పేరు మూర్తి ఇంజనీరింగ్ కళాశాల అని ఉండడం.. అక్కడ గురుకుల పాఠశాల ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. అది తమ పరీక్షా కేంద్రమో కాదో తెలియక అటూ ఇటూ తిరిగి చివరికి అక్కడికి వచ్చేసరికి సమయం మించిపోయింది. దీంతో కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఇక.. కొన్ని పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలను ఏర్పా టు చేయలేదు. దీంతో విద్యార్థులు సమయం ఎంత అయిందో తెలియక, పరీక్ష రాయడానికి ఇంకా ఎంత సమయం ఉందో తెలుసుకునే వెసులుబాటు లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొన్ని కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులతో దీనిపై గొడవకు దిగారు. కాగా.. హైదరాబాద్ జేఎన్‌టీయూ కేంద్రంలో పరీక్షా సమయం ముగియడానికి ముందే పేపర్లు తీసేసుకున్నారని విద్యార్థులు ఆరోపించారు.
మునుపెన్నడూ లేనంత..
నీట్ యూజీ 2018లో మొదలైంది. నాటి నుంచి కిందటి సంవత్సరం దాకా.. ఏ ఏడాదీ నీట్ ప్రశ్నపత్రం ఇంత కఠినంగా లేదని అధ్యాపకులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్ ప్రశ్నలు తమను బెంబెలెత్తించినట్లు విద్యార్థులు వెల్లడించారు. నీట్ పేపర్‌లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో మొత్తం 180 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌లో 45 ప్రశ్నలకుగాను 20-25 ప్రశ్నలకు జవాబు రాస్తే చాలా గొప్పేనని నిపుణులు చెబుతున్నారు. మెరిట్ విద్యార్థులు సైతం ఫిజిక్స్‌లో 30ప్రశ్నలకు మించి సమాధానాలు రాయలేకపోయారని.. ఎవరైనా 40ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఆలిండియా ర్యాంకు తథ్యమని వస్తుందని పేర్కొన్నారు. అలాగే, కెమిస్ట్రీలో ఆరు ప్రశ్నలను అత్యంత కఠినంగా ఇచ్చారని, అవి సుదీర్ఘంగా, సమయం ఎక్కువ తీసుకునేలా ఉన్నాయని ఓ ప్రముఖ విద్యా సంస్థలో కెమిస్ట్రీ సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్న జె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. బోటనీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని.. కొన్ని ప్రశ్నలు కష్టంగా ఇచ్చారని ఆయ న వెల్లడించారు. అయితే మెజారిటీ విద్యార్థులు ఆ ప్రశ్నలకు బాగానే సమాధానాలు రాసినట్టు చెబుతున్నారు. జువాలజీలో 3-4 ప్రశ్నలు అర్థం కాలేదని కొంతమంది పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు బోర్డు ఎగ్జామ్ సిలబ్‌సను పట్టించుకోలేదని.. వాటిలో ప్రశ్నలు అడగడం లేదన్న ధీమాతో ఉంటున్నారని.. కానీ, ఈసారి వాటి నుంచి కూడా ప్రశ్నలు అడిగారని.. నిపుణులు తెలిపారు. ప్రశ్నపత్రం కఠినంగా రావడంతో విద్యార్థులు ఒకరకమైన బాధతో కనిపించారు. కాగా.. నీట్ ఫలితాలను జూన్ 14న వెల్లడిస్తామని జాతీయ పరీక్షా సంస్థ ప్రకటించింది. ఈ నెలఖారులోగా ‘కీ’ విడుదలయ్యే అవకాశం ఉంది.
లాంగ్ టర్మ్ విద్యార్థులకు దెబ్బే..
తెలంగాణలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని పరీక్ష రాసేవారు 12 నుంచి 15 వేల మంది దాకా ఉంటారు. లాంగ్‌టర్మ్ తీసుకుని నిరుడు పరీక్ష రాసినవారిలో 2వేల మంది వరకూ ఎంబీబీఎస్ సీటు సాధించారని.. ఈసారి మాత్రం ఆ సంఖ్య వెయ్యిలోపే ఉంటుందని నీట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా నీట్ లాంగ్‌టర్మ్ విద్యార్థులకు భౌతికశాస్త్రమే ఇబ్బందిగా ఉంటుందని.. ఈ ఏడాది అదే కష్టంగా రావడంతో వారు సీటు కొట్టడం చాలా కష్టమని పేర్కొన్నారు.
779 కాలేజీలు.. 1.17 లక్షల సీట్లు
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 779 మెడికల్ కాలేజీల్లో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం దేశవ్యాప్తంగా 22.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు.
ఆయా సబ్జెక్టుల్లో కఠిన ప్రశ్నల సంఖ్య ఇలా..
సబ్జెక్టు సులభం మధ్యస్థం కఠినం మొత్తం
ఫిజిక్స్ 10 19 16 45
కెమిస్ట్రీ 11 19 15 45
బోటనీ 20 16 14 50
జువాలజీ 19 15 6 40
మొత్తం 60 69 51 180
450 వస్తే జనరల్‌లో సీటు!
కిందటి సంవత్సరం చాలామంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు. ఈసారి 700 సాధించడమే చాలా కష్టం. ఈ ఏడాది కటాఫ్ బాగా (50-60 మార్కుల మేర) తగ్గే అవకాశం కనిపిస్తోంది. నిరుడు తెలంగాణలో 490 మార్కులు సాధించిన వారికి కన్వీనర్ కోటాలో సీటుదక్కింది. ఈసారి 450 మార్కులు సాధిస్తే జనరల్ కేటగిరీలో సీటు రావొచ్చు.
- శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య కాలేజ్, కూకట్‌పల్లి
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..