Share News

Namrata Fertility Scam: 80 మంది శిశువుల విక్రయం

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:07 AM

సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులే నమ్రత మోసాలను చూసి అవాక్కవుతున్నారు.

Namrata Fertility Scam: 80 మంది శిశువుల విక్రయం

  • పిల్లలు లేని దంపతులతో ‘సృష్టి’ చెలగాటం

  • ఒక్కొక్కటిగా వెలుగులోకి డాక్టర్‌ నమ్రత అరాచకాలు

  • సరోగసీ పేరుతో నయవంచన

  • అడ్డగోలుగా శిశు విక్రయాలు

  • పిల్లల అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాలతో లింకులు

  • రూ.25 కోట్ల దాకా ‘సృష్టి’ మోసాలు

  • పోలీసుల దర్యాప్తులో వెల్లడి

  • నమ్రత, ఆమె కొడుకు జయంత్‌ కృష్ణ బ్యాంకు ఖాతాల స్తంభన

  • నమ్రతపై గైనకాలజిస్టు ఫిర్యాదు

  • 8కి చేరిన ‘సృష్టి’ మోసాల కేసులు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులే నమ్రత మోసాలను చూసి అవాక్కవుతున్నారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్‌ట్యూబ్‌ బేబీ, సరోగసి ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత.. వారు సరోగసీకి ఒప్పుకొనేలా కౌన్సెలింగ్‌ ఇచ్చేది. ఆ తర్వాత సంబంధిత దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించేది. ఇందుకోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా.. నవమాసాలు పూర్తయ్యేవరకు సరోగసి మహిళ ఆరోగ్యం, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం.. ఇలా పలు కారణాలు చెప్పి.. అదనంగా దండుకునేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. స్పెషలిస్టు డాక్టర్‌తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంటూ.. ఓ మహిళా గైనకాలజిస్టు లెటర్‌హెడ్‌పై ప్రిస్ర్కిప్షన్‌ రాసేవారని తేల్చారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న సదరు గైనకాలజిస్టు ఫిర్యాదు చేయడం గమనార్హం..! తీరా నవమాసాలు పూర్తయ్యాక.. అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాల నుంచి ఓ శిశువును కొనుగోలు చేసి.. సరగసీ బిడ్డ అని చెబుతూ.. ఆ దంపతులకు ఇచ్చేది. ఇలా నమ్రత ఇప్పటి వరకు 80 మంది శిశువులను సంతానం కోసం తన వద్దకు వచ్చిన దంపతులకు సరగసీ బిడ్డ అంటూ అంటగట్టినట్లు అధికారులు తేల్చారు. తాజాగా మహిళా గైనకాలజిస్టు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన కేసుతో కలిపి.. నమ్రతపై మొత్తం 8 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ అయినట్లు పోలీసులు తెలిపారు.


రూ. కోట్లలో ఆర్థిక లావాదేవీలు..

పిల్లలు లేని దంపతుల నుంచి రూ. లక్షల్లో కొల్లగొట్టిన నమ్రత, ఆమె కొడుకు జయంత్‌ కృష్ణ సుమారు రూ.25 కోట్లు దండుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. దీంతో.. దర్యాప్తు అధికారులు సృష్టి క్లినిక్‌తోపాటు.. తల్లికొడుకుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌చేశారు. నమ్రత ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాలకు సంబంధించిన ఏజెంట్లకు రూ.లక్షలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పోలీసులు త్వరలో ప్రధాన ఏజెంట్లను విచారించనున్నట్లు స్పష్టమవుతోంది.


దంపతుల్లో గుబులు

సృష్టిలో సరగసీ ద్వారా సంతానం పొందిన దంపతుల్లో ఇప్పుడు కొత్త ఆందోళన, గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. సుమారు 80 మంది జీవితాలతో నమ్రత ఆటలాడినట్లు తేలడంతో ‘‘మా పిల్లలు సక్రమమేనా’’ అని వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 05:07 AM