Share News

N Ramchander Rao: బీసీల బిల్లు కాదు.. అది ముస్లింల బిల్లు

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:01 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది బీసీ బిల్లు కాదని, ముస్లింల బిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.

N Ramchander Rao: బీసీల బిల్లు కాదు.. అది ముస్లింల బిల్లు

  • బీసీ రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి రోజుకో మాట

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శ

యాదాద్రి/జనగామ రూరల్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది బీసీ బిల్లు కాదని, ముస్లింల బిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. గురువారం భువనగిరి, జనగామలో నిర్వహించిన పార్టీ జిల్లాస్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, బీసీల పేరుతో ముస్లింల బిల్లును తీసుకువచ్చిందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలకే తప్పా బీసీ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉందని, అందుకు బీసీని ప్రధానమంత్రిని చేయగలిగిందని, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాను కల్పించిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ బీసీలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.


రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని, వీరి నాటకం అర్థమైపోయి ఆ సమావేశానికి సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలు గైర్హాజరయ్యారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం కేసులను సీఐడీకి అప్పగించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయాయన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం యూరియా లెక్కలు తీయగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి స్పందన లేదని విమర్శించారు.

Updated Date - Aug 08 , 2025 | 05:01 AM