Hyderabad: జైల్లో గొడవపడిన వ్యక్తిని చంపడానికి.. బిహార్ నుంచి తుపాకులు
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:30 AM
‘మోస్ట్ వాంటెడ్’ నేరస్థుడు బత్తుల ప్రభాకర్ (30) కేసులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ జైల్లో ఉన్నప్పుడు గొడవపడిన తోటి ఖైదీపై పగ పెంచుకున్న ప్రభాకర్... అతన్ని చంపడానికి పథకం వేశాడు.

‘మోస్ట్ వాంటెడ్’ బత్తుల ప్రభాకర్ కేసులో విస్మయపరిచే అంశాలు
3 దేశవాళీ తుపాకులు, 451 బుల్లెట్లు, 2 క్యాట్రిడ్జిలు, 6 మ్యాగజైన్ల స్వాధీనం
12 ఏళ్లుగా 80కి పైగా చోరీలు
5 రాష్ట్రాల్లో అతనిపై కేసులు
2022లో కస్టడీ నుంచి పరార్
కాలేజీలను ఎంచుకుని చోరీలు
జల్సాలు.. వారాంతాల్లో పబ్‌లకు..
పట్టుకోబోయిన పోలీసులపై కాల్పులు
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ‘మోస్ట్ వాంటెడ్’ నేరస్థుడు బత్తుల ప్రభాకర్ (30) కేసులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ జైల్లో ఉన్నప్పుడు గొడవపడిన తోటి ఖైదీపై పగ పెంచుకున్న ప్రభాకర్... అతన్ని చంపడానికి పథకం వేశాడు. అందుకు బిహార్‌లో తుపాకులు కొన్నాడు. 8 నెలల నుంచి తుపాకులతో తిరుగుతున్నాడు. ఆ క్రమంలోనే శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు. ప్రభాకర్‌ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు ఈ వివరాలు తెలిపారు. అతని వద్ద నుంచి 3 కంట్రీమేడ్ తుపాకులు, ఆరు మ్యాగజీన్లు, 451 లైవ్ రౌండ్ల బుల్లెట్లు, 2 క్యాట్రిడ్జిలతో పాటు చోరీలకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనూ మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా ఉన్న ప్రభాకర్.. సైబరాబాద్ పరిధిలో మరో రెండు భారీ దోపిడీలకు స్కెచ్ వేశాడని మాదాపూర్ డీసీపీ వినీత్ ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. చిత్తూరు జిల్లా సోమలదారి మండలం వడ్డెపల్లి ఇరికిపెంటకు చెందిన ప్రభాకర్ 9వ తరగతి వరకు చదివి మానేశాడు. 2013 నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. అతనిపై సుమారు 80 కేసులు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు మార్చుకునేవాడు. 2020లో అరెస్టయి విశాఖ జైలుకు వెళ్లాడు.
ఇప్పటి వరకు ఏడుసార్లు జైలుకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2022 సెప్టెంబరులో విశాఖలోని అరిలోవలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు మాకాం మార్చాడు. 2023 నుంచి హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేటలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇళ్లలో కాకుండా నగదు పెద్దమొత్తంలో ఉంటుందని ప్రముఖ కాలేజీలు, స్టడీ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు ప్పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఫీజుల వివరాలు తెలుసుకోవాలనే సాకుతో కాలేజీలకు వెళ్లి రెక్కీ నిర్వహించేవాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు వేసుకుని చోరీలకు పాల్పడేవాడు. దొంగిలించిన సొత్తుతో విలాసవంతమైన జీవనం గడుపుతూ పబ్‌లకు వెళ్లి జల్సా చేస్తున్నాడు. శనివారం అతను ప్రిజం పబ్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కాలికి గాయమైంది. ప్రభాకర్‌తో పాటు వచ్చిన వ్యక్తి పారిపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. ప్రభాకర్ ఎవరి నుంచి తుపాకులు కొన్నాడు, అతనికి ఎవరు సహకరించారనే పూర్తి వివరాలు రాబడతామని డీసీపీ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఏసీపీ శ్రీకాంత్, సీసీఎస్ ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అబిబుల్లాఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫ్లాట్‌లో మకాం
బత్తుల ప్రభాకర్ కొంతకాలంగా గచ్చిబౌలిలో ఓ ఎంఎన్‌సీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న స్నేహితుడి ఫ్లాట్‌లో ఉంటున్నాడు. పోలీసులు ఫ్లాట్‌లోని ప్రభాకర్ గదిలో తనిఖీ చేయగా తుపాకులు, బుల్లెట్లు, ఇతర వస్తువులు లభించాయి.