Miss World 2025: ఐటీ ఇలాకాలో బ్యూటీల తడాఖా
ABN , Publish Date - May 23 , 2025 | 05:18 AM
హైదరాబాద్‌లో ఐటీకి చిరునామా అయిన హైటెక్ సిటీ ప్రాంతం మిస్ వరల్డ్ 2025 పోటీదారుల ఆటాపాటలతో గురువారం ఉర్రూతలూగింది.
శిల్పారామంలో ప్రపంచ సుందరి పోటీదారుల ఆటాపాటా
టాలెంట్ ఫినాలేలో 24 మంది ఫైనలిస్టుల పోటాపోటీ
‘ఢోల్ బాజే..’ పాటకు ఆకట్టుకున్న నందినీ గుప్తా నృత్యం
‘రాను.. బొంబైకి రాను’ పాటకు నైజీరియా భామ స్టెప్పులు
టాలెంట్ ఫినాలే విజేతగా ఇండోనేషియా
హైదరాబాద్, ఎల్‌బీనగర్, హైటెక్ సిటీ, మే 22(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఐటీకి చిరునామా అయిన హైటెక్ సిటీ ప్రాంతం మిస్ వరల్డ్ 2025 పోటీదారుల ఆటాపాటలతో గురువారం ఉర్రూతలూగింది. హైటెక్ సిటీలోని సైబర్‌టవర్స్‌కు ఎదురుగా ఉన్న శిల్పారామంలో ప్రపంచ సుందరీమణులు గురువారం మద్యాహ్నం నుంచి రాత్రి వరకు గడిపారు. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులను పరిశీలించారు. కొనుగోలు చేశారు. అలాగే అక్కడున్న మట్టి పాత్రల తయారీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న చిన్న కుండలు చేసి ఆనందించారు. అనంతరం సాయంత్రం జరిగిన టాలెంట్ ఫినాలే పోటీకి ఎంపికైన 24 దేశాల ప్రతినిధులు తమ సంగీత, నృత్య ప్రదర్శనలతో అదరగొట్టారు. అమెరికా ప్రతినిధి నృత్యంతో ప్రారంభమై దాదాపు రెండున్నర గంటలపాటు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. వందలాది ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లతో హైటెక్ సిటీ మార్మోగిపోయింది. .
ఆట పాటలతో హోరెత్తించిన భామలు..
నాలుగు ఖండాల నుంచి ఎంపికైన 24 మంది అందాల భామలు టాప్-10 జాబితాలో చోటు సాధించాలంటే టాలెంట్ ఫినాలే పోటీలు చాలా కీలకం. దీంతో పోటీదారులంతా తమ పూర్తిస్థాయి ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన ‘రాను బొంబయికి రాను’... అనే తెలంగాణ జానపద పాటపై నైజీరియా భామ చేసిన ఇండో ఆఫ్రికన్ నృత్యం ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఫ్లోర్ డ్యాన్స్ ద్వారా ఈస్టోనియా భామ, ‘ఐ లవ్ స్టోరీస్’ అనే అద్భుత గీతంతో బ్రెజిల్ భామ సభికులను ఉర్రూతలూగించగా.. ఐస్ స్కేటింగ్ అద్భుత ఏవీ విన్యాసంతో నెదర్లాండ్ భామ సత్తా చాటింది. పియానోతో చెక్ రిపబ్లిక్, డ్యాన్స్‌తో అర్జెంటీనా భామ, తమ దేశ సంప్రదాయ నృత్యంతో శ్రీలంక ప్రతినిధి అనుది గుణశేఖర ప్రేక్షకులను కట్టిపడేశారు. నృత్యంతో ఇటలీ, ఏరోబిక్స్‌తో ట్రినిడాడ్, పియానోతో జర్మనీ అందాల భామలు సత్తా చాటారు. అత్యవసర వేళల్లో సీపీఆర్ ఎలా చేయాలో వేల్స్ ప్రతినిధి వినూత్నంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. హిందీ చిత్రం రామ్‌లీలాలోని ‘ఢోల్ బాజే ... పాటకు భారత ప్రతినిధి నందిని గుప్తా చేసిన నృత్యం పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నృత్యం చేస్తున్నంతసేపు ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో ఆమెను ప్రోత్సహించారు. చివరగా కెన్యా భామ జుంబా డీజేతో పోటీ ముగిసింది. చివరగా డీజేతో 24 దేశాల ప్రతినిధులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. అందరి ప్రదర్శన అనంతరం తొలి మూడు స్థానాలను నిర్వాహకులు ప్రకటించారు. అద్భుత పియానో ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇండోనేషియా సుందరి మోనికా కేజియాను టాలెంట్ ఫినాలే విజేతగా ప్రకటించారు. కామెరూన్, ఇటలీ ప్రతినిధులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ పోటీలో భారత్ తొలి మూడు స్థానాల్లోనూ నిలవకపోవడంతో కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులు నిరాశ చెందారు. విజేతగా నిలిచిన ఇండోనేషియా భామ.. నందినీ గుప్తా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసియా ఓషియానా ఖండం నుంచి ఉండటంతో.. ఈ పోటీలో భారత్‌కు విజయావకాశాలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
విక్టోరియా హోమ్‌లో సందడి
మిస్ వరల్డ్ 2025 పోటీదారులు గురువారం తొలుత హైదరాబాద్, సరూర్‌నగర్‌లోని వారసత్వ కట్టడం విక్టోరియా హోమ్‌ను సందర్శించారు. 122 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ భవనాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. అనంతరం విక్టోరియా హోమ్‌లోని పాఠశాలలో చదువుకుంటున్న దాదాపు 300 మంది అనాథ బాలలతో గడిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి లక్ష్యాలను తెలుసుకుని ప్రోత్సహించారు. డాక్టర్ రామకృష్ణ చెలికాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా, మలేషియా, జింబాబ్వే, తుర్కియే, సింగపూర్, బంగ్లాదేశ్ ప్రతినిధులు ప్రసంగించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. అలాగే, ప్రతీ విద్యార్థికి మిస్ వరల్డ్ పోటీదారులు 25 బహుమతులు అందజేశారు. పలువురు విద్యార్థులు తాము గీసిన చిత్రాలను ప్రపంచ సుందరీమణులకు బహూకరించారు. ఇక, రామకృష్ణ ఏర్పాటు చేసిన వరల్డ్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్‌ను మిస్ వరల్డ్ క్రిస్టినా, మిస్‌వరల్డ్ చైర్‌పర్సన్ జూలియా మోర్లేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రపంచ సుందరి పోటీదారులు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా ‘రాను బొంబైకి రాను’ అనే జానపద గీతానికి విద్యార్థులతో కలిసి ఆడి, పాడారు. అనంతరం శిల్పారామం చేరుకున్న సుందరీమణులు అక్కడి విలేజ్ మ్యూజియంను పరిశీలించి అక్కడున్న బతుకమ్మలను తిలకించారు. అనంతరం బృందావనంలో కోలాటం కళాకారులతో కలిసి ఆడిపాడారు. రాష్ట్ర మహిళా, స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్... వివిధ పథకాల ద్వారా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీదారులకు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News