Share News

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీలకు ప్రభుత్వ వ్యయం రూ.27 కోట్లు

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:36 AM

ప్రభుత్వ వాటాగా ఉన్న రూ.27 కోట్లను స్సాన్సర్‌ల ద్వారా సమీకరిస్తారు. ఈ పోటీల వివరాలు తెలిపేందుకు బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీలకు ప్రభుత్వ వ్యయం రూ.27 కోట్లు

  • అది కూడా స్పాన్సర్ల ద్వారా సమీకరిస్తాం

  • 250 కోట్ల ఖర్చు చేస్తున్నారన్న విపక్షాల విమర్శలు అవాస్తవం

  • ఈ పోటీలతో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు: జూపల్లి

  • మే 7న 140 దేశాల నుంచి సుందరీమణుల రాక

  • 31న హైటెక్స్‌లో మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి20(ఆంధ్రజ్యోతి): మే 7 వ తేదీ నుంచి 24 రోజుల పాటు తెలంగాణాలో మిస్‌ వరల్డ్‌- 2025 పోటీలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఆరంభ వేడుకలు జరుగుతాయి. మే 31న హైటెక్స్‌లో మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌ నిర్వహిస్తారు. ఈ పోటీల కోసం రూ.54 కోట్లు ఖర్చు కానుంది. ఇందులో ప్రభుత్వశాఖల వాటా రూ.27 కోట్లు కాగా మిస్‌ వరల్డ్‌ సంస్ధ వాటా రూ.27 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రభుత్వ వాటాగా ఉన్న రూ.27 కోట్లను స్సాన్సర్‌ల ద్వారా సమీకరిస్తారు. ఈ పోటీల వివరాలు తెలిపేందుకు బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈఓ జూలియా మోర్లే, మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టీనా పిజ్కోవాతో పాటుగా తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి, పర్యాటక కార్యదర్శి స్మితా సభర్వాల్‌, మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ స్టీవ్‌ మోర్లే తదితరులు పాల్గొన్నారు.


ప్రపంచ స్ధాయిలో తెలంగాణకు గుర్తింపు

జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ పోటీల ద్వారా తెలంగాణలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రపంచ స్ధాయిలో తెలంగాణకు ఓ గుర్తింపు తీసుకురావడానికి 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు తోడ్పడతాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇవ్వలేకున్నా అందాల పోటీలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను జూపల్లి తిప్పికొట్టారు. ప్రతిపక్షాలది పచ్చకళ్ల ధోరణి అని విమర్శించారు.

మిస్‌ వరల్డ్‌ పోటీలు మహిళా సాధికారతకు ప్రతీక

మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈఓ జూలియా మోర్లే మాట్లాడుతూ.. మిస్‌ వరల్డ్‌ అనేది అందం కన్నా అంతర్జాతీయ సంస్కృతి, సాఽధికారతకు ప్రతీక అన్నారు. ఈ పోటీలు అంతర్జాతీయ పర్యాటక, పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణను ముందు వరుసలో నిలుపుతాయన్నారు.


చీర కట్టుకోవడం సంతోషాన్నిచ్చింది.

మిస్‌ వరల్డ్‌- 2024 క్రిస్టినా మాట్లాడుతూ.. ఇండియాకు తన హృదయంలో ప్రత్యేక స్ధానముందన్నారు. గత సంవత్సరం ఇక్కడే తాను మిస్‌ వరల్డ్‌ కిరీటం అందుకున్నానని తెలిపిన ఆమె, తెలంగాణాను అన్వేషించే అవకాశం తనకు కలగడం ఓ అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వైవిధ్యత అనేది ఇండియా బలమన్న ఆమె, ఇక్కడ విభిన్న భాషలు, మతాలు ఉన్నాయని, ఇది ఎంతో ఆందంగా కనిపిస్తుందన్నారు. ఇదే మిస్‌వరల్డ్‌ పోటీల్లోనూ కనిపిస్తుందని తెలిపారు. యాదగిరిగుట్ట దేవాలయం సందర్శించానని దేవాలయ నిర్మాణ శైలి అద్భుతమని ఆమె కొనియాడారు. ఆధ్యాత్మిక పరంగా గొప్ప అనుభూతులను తాను పొందానన్నారు. చీర కట్టుకోవడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు.


తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పోటీలు

పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పోటీలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రామప్ప దేవాలయం సహా పలు ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. 20-30 మందిని బృందాలుగా చేసి తెలంగాణాలో పలు ప్రాంతాలను చూపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోచంపల్లి గ్రామ సందర్శన ద్వారా చేనేత వైభవాన్ని, నాగార్జున్‌ సాగర్‌లో బుద్ధవనం, చార్మినార్‌, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్‌ వాక్‌, చౌమహల్లా ప్యాలె్‌సలో డిన్నర్‌, వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం, కాకతీయ హెరిటేజ్‌ టూర్‌ చేయిస్తామని చెప్పారు. యాదగిరి గుట్టలో ఆధ్యాత్మిక టూర్‌తో పాటుగా మెడికల్‌ టూరిజంను కూడా ప్రమోట్‌ చేస్తామన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 03:36 AM