Miryalaguda: జూనియర్ అసిస్టెంట్ మృతదేహం లభ్యం
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:01 AM
పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యమైన మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఘటన విషాదాంతమైంది.

పనిఒత్తిడి తట్టుకోలేక సాగర్ కాల్వలో దూకి బలవన్మరణం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన
మిర్యాలగూడ అర్బన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యమైన మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఘటన విషాదాంతమైంది. సాగర్ కాల్వలో దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం వేములపల్లి సాగర్ కాల్వ కట్టపై నిలిపి ఉంచిన అతడి స్కూటీని గుర్తించిన పోలీసులు.. గురువారం దొండవారిగూడెం వద్ద సాగర్ ఎడవ కాల్వలో అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్‌కు చెందిన నూనె రాములు, నిర్మల దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్ (30) మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా గత డిసెంబరు నుంచి పనిచేస్తున్నారు.
ఆయనకు పై అధికారులు సంక్షేమ పథకాల అర్హుల జాబితా తయారీ కోసం క్షేత్రస్థాయి సర్వే, దరఖాస్తుల ఆన్‌లైన్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే గంటల తరబడి పనిచేయాల్సి రావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈనెల 28న రాత్రి తన తల్లి నిర్మలకు ఫోన్‌చేసి ‘అమ్మా.. ఈఉద్యోగం నా వల్ల కాదు.. సెలవు పెట్టి గ్రూప్స్ ప్రిపరేషన్‌కు వెళ్తాన’ని చెప్పారు. ఓపికతో వచ్చిన ఉద్యోగం చేయమంటూ తల్లి సర్ది చెప్పింది. దీంతో ప్రవీణ్ బుధవారం వేములపల్లిలోని సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.