Share News

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:15 AM

వికారాబాద్‌ జిల్లా పరిగి, పూడూరు మండలాల్లో గురువారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్‌, న్యామత్‌నగర్‌, పరిగి, చెన్‌గోముల్‌ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.56 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది.

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

  • పరిగి, పూడూరు మండలాల్లో కంపించిన భూమి

  • రిక్టర్‌ స్కేల్‌పై 3.1 తీవ్రత నమోదు

పరిగి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి)/పూడూరు: వికారాబాద్‌ జిల్లా పరిగి, పూడూరు మండలాల్లో గురువారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్‌, న్యామత్‌నగర్‌, పరిగి, చెన్‌గోముల్‌ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.56 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. మూడు, నాలుగు సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలతో ఆ సమయంలో నిద్రలో ఉన్న ప్రజలు తీవ్రభయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరి ఇళ్లల్లో వంట సామగ్రి కిందపడిందని, శబ్దాలు కూడా వచ్చాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పరిగి, పూడూరు మండలాల పరిధిలో భూ ప్రకంపనలు సంభవించిన విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. భూప్రకంపల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.1గా నమోదైంది. పూడూరు మండలం, చన్‌గోముల్‌ గ్రామ పరిధిలోని రైతు ఎండీ ఖయ్యూం పంటపొలం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటు చేసుకోగా, అక్కడ 10 కి.మీ. లోతులో భూమి కంపించినట్లు గుర్తించారు. చన్‌గోముల్‌ కేంద్రంగా ఏర్పడ్డ భూ ప్రకంపనల ప్రభావంతోనే పరిగి, పూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్ప కంపనాలు చోటు చేసుకున్నాయి.


సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, డీపీవో జయప్రద, తహశీల్దార్‌ వెంకటేశ్వరి, ఎంపీడీవో కరీం పరిగి మండలంలోని బసిరెడ్డిపల్లి, రంగాపూర్‌ గ్రామాలను సందర్శించారు. కలెక్టర్‌ గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, చన్‌గోముల్‌ కేంద్రంగా భూ ప్రకంపనలు వెలువడ్డ ప్రాంతానికి దామగుండం నేవీ రాడార్‌ స్టేషన్‌ కేవలం 12 కి.మీ. దూరంలోనే ఉంది. ఈ తరుణంలో చన్‌గోముల్‌ శివారులో 10 కి.మీ. లోతులో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. నేవీ రాడార్‌ స్టేషన్‌లో పలు భవనాలను భూగర్భంలో నిర్మించి అక్కడి నుంచి పర్యవేక్షించనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆ భవనాలు ఎంత మేరకు సురక్షితంగా ఉండే అవకాశం ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. భూ ప్రకంపనల నేపథ్యంలో నేవీ రాడార్‌ స్టేషన్‌ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 05:15 AM