Ponnam Prabhakar: రిజర్వేషన్లపై.. నేడు గవర్నర్ వద్దకు కాంగ్రెస్
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:33 AM
బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు పలువురు మంత్రు లు సోమవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు.
బీసీ బిల్లును ఆమోదించాలని వినతి
గవర్నర్‌తో సమావేశానికి హాజరుకావాలని కోరుతూ బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పక్ష నేతలకు స్వయంగా లేఖలు అందించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు పలువురు మంత్రు లు సోమవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50ు రిజర్వేషన్ల నిబంధనను ఎత్తివేసి.. రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, సభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరనున్నారు. గవర్నర్‌తో సమావేశానికి హాజరుకావాలని కోరుతూ బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పక్ష నేతలకు ప్రభుత్వం లేఖలు రాసింది. ఆ లేఖలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా పార్టీల నేతలకు స్వయంగా అందజేశారు. బీఆర్‌ఎస్ తరఫున ప్రతిపక్ష నేత కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్‌కు, బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి, ఎంఐఎం తరఫున ఎమ్మెల్యే బలాలకు, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావుకు అందించారు.
ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, బీసీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలవనున్నారు. కాగా స్థానికంగా జరిగే ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారంరాష్ట్రాలకు ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు. న్యాయపరంగా అన్ని విషయాలను తెలుసుకునే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయానికి వచ్చామన్నారు. అఖిలపక్ష నేతలతో సోమవారం గవర్నర్‌ను కలిసి.. ఈ విషయంలో సభ్యు లందరూ ఏకాభిప్రాయంతో ఉన్న విషయం వివరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలకు చెందిన మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయత్నాన్ని గుర్తించాలన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పించే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శాసనసభ లాబీల్లో ఆదివారం పొన్నం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
సభలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు: కూనంనేని
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో కేంద్రం చేర్చాలంటే రాష్ట్రస్థాయిలో పోరాటం చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలిసి మాట్లాడాలని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..