Medical Stipend: మెడికోలకు ఉపకారం
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:34 AM
రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాన్ని 15శాతం మేర పెంచుతూ రాష్ట్ర సర్కారు నిర్ణయ్ణం తీసుకుంది.
15% స్టైపెండ్ పెంపు.. జీవో జారీ
ప్రతి నెలా 10 లోపు జమ.. మంత్రి ఆదేశం
జూడాల హర్షం.. దామోదరకు కృతజ్ఞతలు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాన్ని 15శాతం మేర పెంచుతూ రాష్ట్ర సర్కారు నిర్ణయ్ణం తీసుకుంది. అలాగే వైద్య, దంత హౌజ్‌సర్జన్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06461కి పెంచారు. ఈ మేరకు ఆదివారం జీవో జారీ చేశారు. జీవోలోని వివరాల ప్రకారం.. ఇంటర్న్‌లకు ప్రస్తుతం నెలకు రూ. 25,906 ఉపకార వేతనం ఇస్తుండగా దాన్ని రూ.29,792కు పెంచారు. పీజీ డాక్టర్లకు ప్రథమ సంవత్సరంలో ఇస్తున్న రూ. 58,289 మొత్తాన్ని రూ.67,032కు, ద్వితీయ సంవత్సరంలో ఇస్తున్న రూ.61,528 మొత్తాన్ని రూ.70,757కు, ఫైనల్ ఇయర్‌లో ఇస్తున్న రూ.64,767 మొత్తాన్ని రూ.74,782కు పెంచారు. సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు మొదటి ఏడాదిలో రూ. 92,575 ఇస్తుండగా, దాన్ని రూ.1,06,461కు, సెకండ్ ఇయర్‌లో రూ. 97,204 ఇస్తుండగా దాన్ని రూ.1,11,785కు, థర్డ్ ఇయర్‌లో రూ. 101824 ఇస్తుండగా, దాన్ని .1,17,103కు పెంచారు. సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచారు.
స్టైపెండ్ పెంపుపై జూడాలు హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదరను ఆయన నివాసంలో కలసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ఓ ప్రకటనలో జూడాలు తెలిపారు. కాగా వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ను ప్రతినెలా 10వ తేదీలోగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ఈ మేరకు ఏడాదికి సరిపడా స్టైయిపెండ్ చెల్లించేందుకు అవసరమైన బడ్జెట్ రీలిజ్ ఆర్డర్‌ను అధికారులు విడుదల చేశారు. మెడికోలకు ఇప్పటివరకు ఉన్న బకాయిలను కూడా విడుదల చేశారు. కాగా దక్షిణాదిన అత్యధిక స్టైఫండ్ చెల్లిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వైద్య ఆరోగ్శశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
జూలై మొదటివారంలో ఎంసీఎంసీ నివేదిక
ప్రభుత్వ వైద్య కళాశాలపై తనిఖీల కోసం సర్కారు నియమించిన మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందాలు ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటించాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 29 వరకు తనిఖీలు ముగించి 30న నివేదికలివ్వాలి. తనిఖీలు చేయాల్సిన కాలేజీలు ఇంకొన్ని మిగిలిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. దాంతో జూలై మొదటివారంలో తనిఖీలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికివ్వనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.