మిస్టరీగా మారిన యువకుడి మిస్సింగ్
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:33 AM
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఓ యువకుడి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. కనిపించకుండా పోయిన అతణ్ని తానే హత్య చేశానని ఒకరు పోలీసులకు లొంగిపోగా, బాధిత వ్యక్తి కుటుంబసభ్యులు తమకు మృతదేహం అప్పగించాలని ఆందోళనకు దిగారు.
హత్య చేశానంటూ ఒకరి లొంగుబాటు
దొరకని మృతదేహం
సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఓ యువకుడి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. కనిపించకుండా పోయిన అతణ్ని తానే హత్య చేశానని ఒకరు పోలీసులకు లొంగిపోగా, బాధిత వ్యక్తి కుటుంబసభ్యులు తమకు మృతదేహం అప్పగించాలని ఆందోళనకు దిగారు. నిజాంపేట మండలం నాగ్‌దర్ రాంచెందర్ తాండాకు చెందిన దశరథ్ (30) సంగారెడ్డిలోని గణపతి షుగర్స్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తన సొంత ఊరైన రాంచెందర్ తండాకు వెళ్తానని చెప్పి తాను పనిచేస్తున్న యజమాని వద్ద బైకు తీసుకొని దశరథ్ బయల్దేరాడు. అయితే ఇంటికి చేరలేదు. విషయం తెలుసుకున్న దశరథ్ భార్య శుక్రవారం సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నారాయణఖేడ్ మండలం మేఘ్యానాయక్ తండాకు చెందిన గోపాల్ అనే వ్యక్తి దశరథ్‌ను తానే హత్య చేసి, మృతదేహాన్ని దహనం చేశానని శనివారం నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దశరథ్‌కు ఓ మైనర్ బాలికతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతోనే హత్య చేసినట్లు అతడు తెలిపాడు. అతడిని అదుపులోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో పోలీసులు వెతకగా దశరథ్ మృతదేహం మాత్రం లభించలేదు. విషయం తెలుసుకున్న దశరథ్ కుటుంబసభ్యులు నిజాంపేట-నారాయణఖేడ్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దశరథ్ హత్యకు గురైతే మృతదేహం అప్పగించాలని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.