Share News

Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. 400 గుడిసెలు దగ్ధం..

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:42 PM

హయత్‌నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి నగర్‌లో పేదల గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానిక ప్రజలు భయంతో ..

Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. 400 గుడిసెలు దగ్ధం..
Fire Accident File Photo

హైదరాబాద్‌, ఏప్రిల్ 26: హయత్‌నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి నగర్‌లో పేదల గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానిక ప్రజలు భయంతో తమ తమ గుడిసెల్లోంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 4 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.


ప్రమాదంపై జిల్లా ఫైర్ ఆఫీసర్ కేశవులు మాట్లాడారు. తమకు గంట క్రితం ఫైర్ స్టేషన్‌కి కాల్ వచ్చిందని.. కుంట్లూరు రావి నారాయణరెడ్డి కాలనీ సమీపంలో గుడిసెలు తగలబడిపోతున్నాయని సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే ఎల్బీనగర్, హయత్‌నగర్‌లోని తమ సిబ్బందిని అలర్ట్ చేసి 5 ఫైర్ ఇంజిన్లను పంపించామన్నాు. సుమారుగా 300 నుంచి 400 వరకు గుడిసెలు దగ్ధమైనట్లు తెలిపారాయన. ఇప్పటి వరకు దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చాయని.. మరో 2 ఫైరింజన్లు వస్తున్నాయని ఫైర్ ఆఫీసర్ కేశవులు తెలిపారు.


అబ్దుల్లాపుర్‌మెట్ ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కుంట్లూరు రెవెన్యూ పరిధిలో రావి నారాయణరెడ్డి కాలనీ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని సమాచారం వచ్చింది. తాము కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాము. ఎన్ని గుడిసెలు తగలబడ్డాయి, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రమాదానికి గల కారణాలు పోలీసులను అడిగి తెలుసుకుని నివేదిక ఇస్తాము అని తెలిపారు.


ప్రత్యక్ష సాక్షి సైదులు మాట్లాడుతూ.. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక గుడిసెలో మొదటగా మంటలు చెలరేగాయి. దాని నుండి పక్కనున్న గుడిసెలకు కూడా వ్యాప్తి చెందాయి. సుమారుగా 400 గుడిసెలు తగలబడిపోయాయి. మొదటగా తగలబడిన గుడిసెలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గుడిసెలో దేవుడి పూజ కోసం దీపం మంటలు అంటుకోవడంతో ఘటన జరిగినట్టు అనుకుంటున్నాము. వెనకాల పక్కన ఉన్న గుడిసెలోని సిలిండర్లు పేలడంతో ప్రమాదం పెద్దదయింది.


Also Read:

జేడీ వాన్స్ తాజ్‌మహల్ ఫొటోలపై ఎలాన్ మస్క్

విరాట్ వెనుక హనుమయ్య

నీ భర్త మంచివాడైతే.. ఈ విషాదం ఏంటి..

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 03:42 PM