Saraswati Pushkaralu: కాళేశ్వర క్షేత్రం.. భక్తజన సందోహం
ABN , Publish Date - May 18 , 2025 | 04:52 AM
సరస్వతీ పుష్కర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. పుష్కరాల మూడోరోజైన శనివారం లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.
సరస్వతీ పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు... మూడో రోజు లక్ష మందికిపైగా భక్తుల రాక
డిప్యూటీ సీఎం భట్టి, తుమ్మల పుణ్యస్నానాలు
అర్ధరాత్రి వర్షంతో ఏర్పాట్లు అతలాకుతలం
భూపాలపల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): సరస్వతీ పుష్కర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. పుష్కరాల మూడోరోజైన శనివారం లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రహదారులు బురదమయంగా మారినా, ఏడు కి.మీ. మేర ట్రాపిక్ స్తంభించినా.. భక్తులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీ మాతను, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారాంతపు సెలవులు కావడంతో విద్యార్థులు మహిళలు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ట్రాఫిక్ స్తంభించినప్పటికీ భక్తులు లెక్కచేయకుండా కాళేశ్వరానికి తరలిరావడం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచిభక్తులు పెద్దసంఖ్యలో తరలిరాగా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల నుంచీ భారీ సంఖ్యలో వచ్చారు. భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అధికారులు రద్దీని నియంత్రించలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అధికారులు.. వీఐపీల దర్శనాలకు ప్రాధాన్యమిచ్చి సామాన్యులను విస్మరించడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
పుణ్యస్నానాలు ఆచరించిన మంత్రులు
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఠాకూర్ మక్కాన్‌సింగ్ తదితరులు శనివారం పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఆయన సోదరుడు ప్రసాద్.. వారి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి గోదావరిలో తర్పణం వదిలారు. అలాగే ముక్తీశ్వరాలయంలో భట్టి కుటుంబ సభ్యులు కాలసర్పదోష నివారణ పూజలు జరిపించుకున్నారు. కాళేశ్వరాలయంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచంతో పోటీపడే స్థాయికి రాష్ట్రం ఎదగాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు దగ్గరుండి పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించారని ప్రశంసించారు.
వర్షంతో భక్తుల ఇక్కట్లు..
వర్షం కారణంగా సరస్వతీ పుష్కరఘాట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలు, టెంట్ సిటీ దెబ్బతిన్నాయి. భారీ కటౌట్లు, ప్లెక్సీలు, టెంట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ ధ్వంసమైంది. దాంతో అధికారులు ఉదయం 9గంటల వరకు యుద్ధప్రాతిదికన మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు. కలెక్టర్ రాహుల్ శర్మ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించగా.. పోలీసులు రద్దీ నిర్వహణ చేపట్టారు. అయితే ఊహించని రీతిలో భక్తులు రావడం, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో 7కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. కాగా, ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తుల నుంచి గ్రామపంచాయతీ కాంట్రాక్టర్లు ముక్కుపిండి టోల్ వసూలు చేయడం, దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్దుకున్న అధికారులు శుక్రవారం నుంచి టోల్ వసూళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News