Share News

Manda Krishna : వర్గీకరణలో కుట్ర జరిగింది

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:26 AM

స్సీ వర్గీకరణ నివేదిక అశాస్త్రీయంగా ఉందని, కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు వెనుక కుట్ర జరిగిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఆ కారణంగానే ఏకసభ్య కమిషన్‌ చేసిన సిఫారసుల్లో మాదిగలకు దక్కాల్సిన మేరకు రిజర్వేషన్‌ రాలేదని అన్నారు.

Manda Krishna : వర్గీకరణలో కుట్ర జరిగింది

  • మాదిగలకు 11 శాతం రిజర్వేషన్‌ కావాలి

  • 9 శాతానికే పరిమితం చేయడం అన్యాయం

  • రిజర్వేషన్‌ సాధనలో దామోదర ఫెయిల్‌

  • కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు

  • ‘లక్ష డప్పులు’ వాయిదా: మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌/పంజాగుట్ట, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ నివేదిక అశాస్త్రీయంగా ఉందని, కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు వెనుక కుట్ర జరిగిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఆ కారణంగానే ఏకసభ్య కమిషన్‌ చేసిన సిఫారసుల్లో మాదిగలకు దక్కాల్సిన మేరకు రిజర్వేషన్‌ రాలేదని అన్నారు. గ్రూపు-3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను అత్యంత వెనుకబడిన కులాలను ఉంచిన గ్రూపు-1లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. కులాల కూర్పు, రిజర్వేషన్ల కేటాయింపుపై కొంత మంది నెరిపిన మంత్రాంగం వల్లే మాదిగ జాతికి 11శాతం రిజర్వేషన్‌ అందలేదని విమర్శించారు. మాదిగల రిజర్వేషన్‌ను కేవలం 9శాతానికే పరిమితం చేయడం.. అన్యాయమని అన్నారు. అసలు వర్గీకరణ ప్రక్రియను ఏ విధంగా చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనాభా ప్రాతిపదికన, వెనుకబాటుతనం ప్రాతిపదికన చేసినా మాదిగలకే రిజర్వేషన్‌ ఎక్కువ రావాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణలో లోపాలున్నాయని.. దీన్ని ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘ఎస్సీ వర్గీకరణ ఆమోదం.. మూడు గ్రూపుల్లో రిజర్వేషన్ల కేటాయింపు, గ్రూపుల్లో కులాల చేర్పులు’’ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ వెంకటేశ్‌ నేతతో కలిసి మంద కృష్ణ మాట్లాడారు.


వర్గీకరణకు అనుకూలంగా ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఇవ్వడాన్ని, వర్గీకరణ అ మలుకు ప్రభుత్వం అనుకూలంగా ఉండడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, 59 ఎస్సీ కులాల్లో మాదిగ వర్గంలోనే అధిక జనాభా ఉందని, తమ వాటా మేరకు రిజర్వేషన్‌ కేటాయించాలని గతంలో కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా.. ఆ మేరకు కేటాయింపులు జరగలేదన్నారు. జనాభాలో మాదిగలకంటే తక్కువగా ఉన్న 17,71,682 మంది మాలలకు 5శాతం రిజర్వేషన్‌ ఇచ్చినప్పుడు, వెనుకబడి ఉన్న 32,74,377 మంది మాదిగలకు 9శాతమే కేటాయించడమేంటని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో వర్గీకరణ జరిగినప్పుడు ఏ, బీ, సీ, డీ కేటగిరీలు ప్రకటించారని, అప్పుడు ప్రయోజనం పొందిన వారి జాబితాలో ఉన్న పంబాల, కొలుపుల వాండ్లు, పంబాడ, పంబండ, మన్నె తదితర కులాలను ఇప్పుడు అత్యంత వెనుకబడిన కులాల్లోకి ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. బాగా అభివృద్ధి చెందిన పంబాల కులాన్ని వెనుకబడిన జాబితాలో చేర్చడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. పంబాల వర్గానికి చెందిన ఘంటా చక్రపాణి కుటుంబంలోనే ముగ్గురు ప్రొఫెసర్లు ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా వారి జనాభా వెయ్యి కూడా లేదని పేర్కొన్నారు.


డక్కలి కులానికి చెందిన వారు 2500 మంది ఉన్నా.. వారిలో చాలా మందికి ఇప్పటికీ సరైన విద్యా అవకాశాలు రాలేదని చెప్పారు. గతంలో గ్రూపు-బీలో ఉన్న బేడ, బుడ్గ జంగాలను ఇప్పుడు వెనుకబడిన కులాల జాబితాలోకి మార్చి.. మాదిగ జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పారు. దళితుల్లో అధిక జనాభా కలిగి, వెనుకబడి ఉన్న కులాల జాబితాలో ఉన్న నేతకాని వర్గాన్ని.. అభివృద్ధి చెందిన కులాల జాబితాలో పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నేతకాని కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్‌.. అదే వర్గం వ్యక్తి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. వర్గీకరణలో నేతకాని వర్గానికి ఒక శాతం రిజర్వేషన్‌ కేటాయించాలని ఎందుకు కోరలేదని అడిగారు. వర్గీకరణను అడ్డుకోవడం సాధ్యం కాదని తెలిసీ.. ఇలా కులాల కూర్పులో మంత్రాంగాన్ని నడిపించారని ఆరోపించారు. కాగా, కమిషన్‌ ప్రతిపాదించిన క్రిమీలేయర్‌ సిఫారసును తిరస్కరించిన ప్రభుత్వం.. కులాల వారీ రిజర్వేషన్ల విషయంలో మూడు గ్రూపులనే ఎందుకు ఆమోదించిందని ప్రశ్నించారు. అందరికీ న్యాయం చేయడం కోసం మూడు గ్రూపులను నాలుగు గ్రూపులుగా చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని ప్రభుత్వం స్పందించి అందరికీ న్యాయం చేయాలని సూచించారు.


దామోదరను మంత్రి వర్గం నుంచి తప్పించాలి

ఏకసభ్య కమిషన్‌ సిఫారసుల్లో మాదిగ జాతికి దక్కాల్సిన స్థాయిలో రిజర్వేషన్లు ప్రతిపాదించలేదన్న విషయం సీఎం రేవంత్‌రెడ్డికి ముందే తెలుసని మంద కృష్ణ అన్నారు. వర్గీకరణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందుగానే సీఎం రేవంత్‌ ఇద్దరు మాదిగ ప్రతినిధులతో మాట్లాడారని.. ఆ సమయంలోనే మాదిగ జనాభా ప్రకారం రిజర్వేషన్‌ రాలేదని.. కొంచెం సర్దుబాటు చేసుకోవాలని కోరినట్లు తెలిసిందన్నారు. అప్పుడే తమకు రిజర్వేషన్‌ తగ్గిందన్న విషయం అర్ధమైందన్నారు. ఈ విషయమై వెంటనే మాదిగ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించానని ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో.. ఆ పార్టీ ప్రతినిఽధి ఎర్రోళ్ల శ్రీనివా్‌సకు విషయం చెప్పానన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడే ప్రయత్నం చేసినా సమయం ఇవ్వలేదన్నారు. జనాభా దామాషా మేరకు మాదిగ జాతికి రిజర్వేషన్లను తీసుకురావడంలో మంత్రి దామోదర రాజనర్సింహ విఫలమయ్యారని విమర్శించారు.


మంత్రి వర్గం నుంచి ఆయన్ను తప్పించి.. ఆయన స్థానంలో మరో ఇద్దరు మాదిగలను తీసుకోవాలని సీఎంకు సూచించారు. ఇక నుంచి దామోదరను మాదిగ జాతి బిడ్డగా, తమ సామాజిక వర్గం ప్రతినిధిగా పరిగణించబోమని చెప్పారు. ఆయనొక మౌన ముని అని, కుటుంబ లబ్ధి కోసం మాత్రమే మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. ఆయన కారణంగా మాదిగ జాతి బిడ్డలు మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల వారీగా కేటాయించిన వాటాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన ‘‘లక్ష డప్పులు.. వేల గొంతులు’’ కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమం వాయిదా పడినప్పటికీ డప్పుల కొనుగోలు మాత్రం ఆగకూడదని మాదిగలకు పిలుపునిచ్చారు. తాము నిర్వహించబోయే కార్యక్రమాన్ని వర్గీకరణపై నిరసనగా కాకుండా.. ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..

Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..

Updated Date - Feb 06 , 2025 | 04:26 AM