Share News

Maheshwar Reddy: రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది..?

ABN , Publish Date - Sep 01 , 2025 | 03:50 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని.. కానీ, విచారణ నివేదికలో మాత్రం ఆ అక్రమాలపైన పూర్తిస్థాయిలో ఎక్కడా ప్రస్తావించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

Maheshwar Reddy: రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది..?

  • నివేదికలో ఆ అక్రమాల ప్రస్తావన ఏదీ? : ఏలేటి

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని.. కానీ, విచారణ నివేదికలో మాత్రం ఆ అక్రమాలపైన పూర్తిస్థాయిలో ఎక్కడా ప్రస్తావించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మూడు బ్యారేజీల నిర్మాణాల్లో నాణ్యత లేకపోవడంతో కుంగిపోయాయని నివేదికలో ఉందని.. అంటే అవినీతి అంతా వాటి నిర్మాణానికి అయిన రూ.7 వేల కోట్ల చుట్టూ మాత్రమే తిరిగిందన్నారు. రూ.లక్ష కోట్ల అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. మొత్తం ప్రాజెక్టులో అక్రమాలను ఎందుకు బయటపెట్టలేకపోయారని నిలదీశారు.


కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు కేసీఆర్‌ బాధ్యుడని.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆయన్ను అరెస్ట్‌ చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదే పదే చెప్పారని.. ఇప్పుడేమో కేసీఆర్‌ చర్లపల్లి జైలులో ఉన్నా.. ఫామ్‌హౌ్‌సలో ఉన్నా ఒకటేనని అనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ‘‘కాళేశ్వరం అవినీతిపై చర్చపెట్టి దానిపై ఏం చేయాలో మమ్మల్ని అడగడం దేనికి..? రూ.లక్షకోట్ల అవినీతిని ఎలా బయట పెడతారో మీరే చెప్పండి..? అవినీతిని సాక్ష్యాలతో బయట పెట్టండి’’ అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కమిషన్‌లో కాళేశ్వరం అవినీతి అక్రమాలను పూర్తిస్థాయిలో ప్రస్తావించలేదని.. కోర్టులు, సిట్‌, సీబీఐలో కేసు నిలబడకుండా నివేదికను నీరుగార్చారని ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని, కోరల్లేని పాములా నివేదిక ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తన మానస పుత్రిక అని చెప్పిన కేసీఆర్‌.. కమిషన్‌ నివేదికపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. రాజకీయంగా కొందరు అధికారులను బద్నాం చేయడానికి ప్రయత్నించారని, రామకృష్ణారావు పేరును ఎందుకు ప్రస్తావించలేదని ఏలేటి ప్రశ్నించారు.

Updated Date - Sep 01 , 2025 | 03:50 AM