Share News

Mahesh Kumar Goud: కవిత ప్రకటనతో కేసీఆర్‌ కుటుంబ దోపిడీ గుట్టురట్టు!

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:31 AM

ఒకప్పుడు కార్లలో డీజిల్‌ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్‌ కుటుంబం నేడు వేల కోట్లకు పడగలెత్తిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అవినీతి సొమ్ముతోనే ఈ స్థాయికి చేరిందని ఆరోపించారు.

Mahesh Kumar Goud: కవిత ప్రకటనతో కేసీఆర్‌ కుటుంబ దోపిడీ గుట్టురట్టు!

  • కార్లలో డీజిల్‌ పోసుకోలేని స్థాయి నుంచి వేల కోట్లకు..

  • 2029లో రాహుల్‌ ప్రధాని కావడం తథ్యం

  • టీపీసీసీ భేటీలో మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు కార్లలో డీజిల్‌ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్‌ కుటుంబం నేడు వేల కోట్లకు పడగలెత్తిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అవినీతి సొమ్ముతోనే ఈ స్థాయికి చేరిందని ఆరోపించారు. ఆ కుటుంబం ఓ దొంగల ముఠా అని విమర్శించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఖేల్‌ ఖతమని చెప్పారు. కవిత ప్రకటనతో కేసీఆర్‌ కుటుంబ దోపిడీ బట్టబయలైందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మహేశ్‌ గౌడ్‌ పార్టీ నాయకులకు సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ నాయకులకు దేవుడు గుర్తొస్తాడని విమర్శించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ దేవుళ్ల పేరు చెప్పి గెలిచారని ఆరోపించారు. ఓటు చోరీ వల్లే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారన్నారు. ఓటు చోరీపై రాహుల్‌ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ.. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? అని మహేశ్‌ గౌడ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాల వారు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారన్నారు. ఉచిత బస్సు మొదలుకొని సన్నబియ్యం వరకు రాష్ట్రంలో అనేక చరిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. 2029లో మోదీకి పరాభవం తప్పదని.. రాహుల్‌ ప్రధాని కావడం తథ్యమని అన్నారు. ఈ నెల 15న లక్షల మందితో కామారెడ్డిలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


బీఆర్‌ఎస్‌ ఎన్ని ముక్కలవుతుందో: భట్టి

బీఆర్‌ఎస్‌ చేసిన తప్పిదాలతో ఆ పార్టీ ఎన్ని ముక్కలు అవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలను ఒక ఉద్యమంలా పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడానికి అంతా కలిసి పని చేద్దామని, ఆయన ప్రధాని కావడం దేశానికి అవసరమని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేశ్‌గౌడ్‌కు అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి కార్యకర్తకు ఏదో ఒక పదవి లభిస్తుందని చెప్పారు.


దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌: మీనాక్షి

తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ చెప్పారు. తాను ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు నెలలకోసారి పీసీసీ సమావేశం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో 70-80 శాతం పాత వారికి పదవులు ఇచ్చామని, మిగిలిన 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పించామని చెప్పారు. రేవంత్‌ ఓసీ అయినప్పటికీ బలహీన వర్గాలకు చెందిన మహేశ్‌గౌడ్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్

ఆలయాల అభివృ‌ద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు

For More TG News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 04:31 AM