Harish Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇస్తాం
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:50 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహన్ని..
కేసీఆర్ బీసీ పక్షపాతి
పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో హరీశ్
చిన్నకోడూరు/గజ్వేల్/జగదేవ్‌పూర్/హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహన్ని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. బీసీలకు టికెట్ల విషయంలో కాంగ్రెస్ ఇప్పుడు మాటలు చెబుతోందని, గత పంచాయతీ రాజ్ ఎన్నికల్లోనే బీసీలకు 41 శాతం టికెట్లు ఇచ్చి కేసీఆర్ బీసీల పక్షపాతిగా నిలిచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో గొప్ప పోరాట యోధుల చరిత్ర మరుగున పడిందని, తమ హయాంలోనే పాపన్నగౌడ్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చామని చెప్పారు. లండన్ విక్టోరియా మ్యూజియంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని పెట్టి బ్రిటన్ దేశం గౌరవించింది.. కానీ, మన పాలకులు గుర్తించకపోవడం బాధాకరమని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గౌడ కులస్తులకు మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లో డెంగీతో మృతి చెందిన నాయిని శ్రావణ్, కొంతం మహేశ్ కుటుంబాలను హరీశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసిందని, గ్రామాల్లో విషజ్వరాలు అలుముకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్, శ్రావణ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 26వేల మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్‌లో పెట్టామని.. కానీ ఈ ప్రభుత్వం రైతులకు కనీసం 3 వేల మెట్రిక్ టన్నులు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
కర్షకులకు కాళరాత్రులు
కాంగ్రెస్ పాలన కర్షకులకు మళ్లీ కాళరాత్రులను తెచ్చిందని, రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఆనాటి రోజులు గుర్తుచేస్తూ.. రైతన్నను నడిరోడ్డు మీదకు ఈడ్చారని హరీశ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News