Ashwaravupeta: డబ్బు కోసం అభ్యర్థుల తంటాలు.. గ్రామ పెద్దల ద్వారా అప్పులు!
ABN , Publish Date - Dec 06 , 2025 | 07:25 AM
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏదో పార్టీ తరఫున సీటు సాధించడం ఒక ఎత్తు. సీటు ఖరారు కాగానే గెలుపు కోసం సమీకరణలు, పెద్దల మద్దతు, సంఘీబావంతో పాటు మరో ముఖ్యమైన అంశం నగదు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారనుంది. సొమ్ములేనిదే అడుగుకూడా పడే పరిస్థితి లేదు.
అశ్వారావుపేట, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏదో పార్టీ తరఫున సీటు సాధించడం ఒక ఎత్తు. సీటు ఖరారు కాగానే గెలుపు కోసం సమీకరణలు, పెద్దల మద్దతు, సంఘీబావంతో పాటు మరో ముఖ్యమైన అంశం నగదు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారనుంది. సొమ్ములేనిదే అడుగుకూడా పడే పరిస్థితి లేదు. సొమ్ములు ఇవ్వకపోతే నిన్న, మొన్నటి వరకు వెంటే నడిచినవారు కూడా దావత్ లేకపోతే ఎలా అంటూ అభ్యర్థులపై బెదిరించే పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచార సామగ్రి, ప్రచారానికి కార్యకర్తల మద్దతు, ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి రోజుల్లో జరిగే పంపకాలు, మధ్య మధ్యలో మద్యం ఇతరత్రా కార్యక్రమాలు జరిపితే కానీ ఎన్నికల్లో ముందుకెళ్లే పరిస్థితి లేదు. పదవి కోసం వీటన్నింటికీ లక్షల్లోనే ఖర్చు అవుతుంది.
కొంతమేర మద్దతుగా నిలచిన పార్టీల నుంచి సహకారం లభించినప్పటికీ సర్పంచ్ అభ్యర్థి ఆ పంచాయతీలోని ఓట్లను బట్టి కనీసం రూ.10 నుంచి రూ.25 లక్షలకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందంటున్నారు. జనరల్ స్థానాల్లో అయితే ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు నానా పాట్లు పడుతూ పైసలు కోసం పరుగులు పెడుతున్నారు. ఈ మండలం ఏజెన్సీ ప్రాంతం కావడంతో అందరూ గిరిజన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. సీటు ఖరారైన వారు సొమ్ముల కోసం పరుగులు పెడుతున్నారు. కొందరు నోట్లు రాసి అప్పులు తెస్తుండగా, మరి కొందరు భూములు, ఇతరత్రా ఆస్తులు తనఖా పెట్టి పైసలు సమ కూర్చుకుంటున్నారు. మరి. కొందరు భూములను విక్రయానికే పెడుతున్నారు. అవేమి లేని అభ్యర్ధులకు గ్రామంలో మద్దతుగా ఉన్న పెద్దల హామీలపై నోట్లు రాయించి అప్పులు ఇప్పిస్తున్నారు. ఏజెన్సీ పంచాయతీల్లో ఉప సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్న వారు కీలకమయ్యే అవకాశాలుండటంతో ఆ వ్యక్తితో కొంత సొమ్మును పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలిసిన బంధువులు, స్నేహితులకు ఫోనులు చేసి ఆర్థిక సహకారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. శనివారం ఉపసంహరణల అనంతరం అభ్యర్థులు నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగిపోలేని పరిస్థితి, పట్టుమని వారం రోజుల్లోనే ఎన్నికల తేదీ వస్తుండటంతో అభ్యర్థులు వార్డు సభ్యుని వద్ద నుంచి సర్పంచ్ అభ్యర్థులంతా సొమ్ముల కోసం పరుగులు పెడుతున్నారు. ఇదే సమయంలో కొందరు పెట్టుబడుదారులకు ఈ ఎన్నికలు సిరులు కురిపిస్తున్నాయి. ఇరువైపుల అభ్యర్థులు లక్షల్లో సొమ్ములు వెచ్చించాల్సిన పరిస్థితి. ఎన్నికల అనంతరం గెలిచిన అభ్యర్థి ఓ రకమైన బాధతో, ఓడిన వ్యక్తి మరో రకమైన బాధతో ఉంటారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్