Share News

ఆపరేషన్‌ కగార్‌ను ఆపేయాలి

ABN , Publish Date - May 23 , 2025 | 05:07 AM

మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలు నిరసనలకు దిగారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

ఆపరేషన్‌ కగార్‌ను ఆపేయాలి

  • ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్డు జడ్జితో విచారణ జరపాలి

  • కేంద్రం మావోయిస్టులతో చర్చలు నిర్వహించాలి

  • వామపక్ష పార్టీలు, ప్రజా, పౌర హక్కుల సంఘాలు

  • హైదరాబాద్‌లో నిరసనలు.. ఖమ్మంలోనూ ఆందోళన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలు నిరసనలకు దిగారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మందిని బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని.. సుప్రీం కోర్టు సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరపాలన్నారు. గురువారం హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పౌర హక్కుల సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అభివృద్ధి, పథకాల పేరుతో అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఇటు మావోయిస్టులను, అటు ఆదివాసీలను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయిస్తోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అన్నారు. మావోయిస్టులు శాంతియుతంగా చర్చలు జరుపుదామమని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోకుండా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి బండి సంజయ్‌ నిర్లక్ష్యంగా కేంద్ర బలగాలకు ఆయుధాలిచ్చి హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.


కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, కో ఆర్డినేషన్‌ కమిటీ ఫర్‌ ది పీస్‌ కన్వీనర్‌ నార్ల రవి, వీక్షణం పత్రిక ఎడిటర్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ 10 వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ సభ్యుడు కె.గోవర్ధన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగం, చట్టాలను ఉల్లంఘించి జంతువులను వేటాడినట్లుగా ఆదివాసీలను, మావోయిస్టులను హత్య చేయడం దారుణమని సీపీఐ(ఎంఎల్‌) కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు పశ్యపద్మ మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇటు ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్రంపై మండిపడ్డాయి. మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపి.. కేంద్రం ఎన్‌కౌంటర్‌ అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్‌, పీపుల్స్‌ జేఏసీ చైర్మన్‌ దేవిరెడ్డి విజయ్‌ తదితరులు కరపత్రాలను విడుదల చేశారు.


శాంతి చర్చలు ప్రారంభించాలి: చంద్రన్న

ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి ఆయన పేరిట పంపిన లేఖలో పలు అంశాలను వెల్లడించారు. ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్న నంబాలను, మరికొందరిని అడవికి తీసుకొచ్చి బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.


న్యాయ విచారణ జరపాలి: కూనంనేని

మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్రాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే సుప్రీంకోర్టే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరిట పోలీసులు సాగిస్తున్న ఎన్‌కౌంటర్లను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్‌, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:07 AM