ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన రేవంత్
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:43 AM
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం రేవంత్.. తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత
మోదీ కులంపై మాట్లాడే స్థాయి.. రేవంత్‌కు లేదు: ఎంపీ లక్ష్మణ్
భగత్‌నగర్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం రేవంత్.. తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు పట్టిన గతే ఆయనకూ పడుతుందని ధ్వజమెత్తారు. శనివారం కరీంనగర్‌లో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు.
సర్కారు చేపట్టిన కుల గణన ఓ బోగస్ ప్రక్రియ అని విమర్శించారు. హిందూ ముస్లిం, బీసీ ముస్లిం అని ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. సర్వే లెక్కలు బోగస్ అని తేలడంతోనే మళ్లీ సర్వేకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్నారు.