Share News

Land Allocation: హెచ్‌సీయూకే అత్యధిక భూములు

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:45 AM

కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్‌ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్‌లు, పరిశోధన విభాగాలు.. ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది.. అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలేమీ లేవు.

Land Allocation: హెచ్‌సీయూకే  అత్యధిక  భూములు

మిగిలింది 1630 ఎకరాలు.. అయినా సెంట్రల్‌ వర్సిటీల్లో టాప్‌

  • పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు.. కొత్త తరం వర్సిటీలకు 150-500 ఎకరాలే

  • భారీగా భూములున్న సెంట్రల్‌ వర్సిటీల్లో వినియోగం తక్కువే!.. 25 శాతానికి మించి వాడుకోని వైనం

  • విద్యార్థుల సంఖ్యకు, విస్తీర్ణానికి పొంతనే లేదు.. సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ

  • రాష్ట్రంలో జేఎన్‌టీయూహెచ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ చదివిన జేఎన్‌ఏఎ్‌ఫఏయూలకు సొంత భూమే లేదు!

  • లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ రెండు విశ్వవిద్యాలయాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్‌ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్‌లు, పరిశోధన విభాగాలు.. ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది?.. అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలేమీ లేవు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) భూములు, వాటిని ఆనుకుని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళనలు నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (సెంట్రల్‌ వర్సిటీలు) దేశంలో ఎన్ని ఉన్నాయి? అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయవిశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే, ఒక సెంట్రల్‌ వర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్‌సీయూ విషయంలో జరిగినంతగా ఎప్పుడూ, ఎక్కడా జరగలేదేమో! దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ యూనివర్సిటీలు 1000, 1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్‌ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌ 1300 ఎకరాల్లో ఉంది. 1974లో ఏర్పాటు చేసిన హెచ్‌సీయూకి తొలుత 2324 ఎకరాలు కేటాయించారు. అందులో పలు సంస్థలకు భూములు ఇచ్చారు. ప్రస్తుతం వర్సిటీ 1630 ఎకరాల్లో ఉంది. ఇంత భూమి ఉన్న సెంట్రల్‌ వర్సిటీ దేశంలో మరొకటి లేదు. అయితే ఆ తర్వాత కాలంలో ఏర్పాటు చేసిన వర్సిటీలకు క్రమంగా భూ కేటాయింపులు తగ్గిపోయాయి. 2009లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన వాటికి తక్కువ విస్తీర్ణమే ఉంది. ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 19 వర్సిటీలను ఏర్పాటు చేశారు. అప్పటికే కళాశాలలుగా ఉన్న కొన్నింటిని కేంద్రీయ వర్సిటీలుగా మార్చారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 151 ఎకరాల్లో ఉండగా, జామియా మిల్లియా ఇస్లామియా వర్సిటీ 254 ఎకరాల్లో ఉంది. అసలు సెంట్రల్‌ వర్సిటీల ఏర్పాటుకు ఎంత భూమి ఉండాలి? అన్నదానిపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఒక కమిటీని నియమించగా.. కొన్ని సిఫారసులతో నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం సెంట్రల్‌ వర్సిటీకి 500 ఎకరాలుంటే సరిపోతుంది. రాష్ట్ర వర్సిటీలకు ఆయా రాష్ట్రాల చట్టాలను బట్టి భూ కేటాయింపు ఉంటుందని తెలిపింది.


వినియోగిస్తున్న భూమి ఎంత?

విశ్వవిద్యాలయాలకు ఉన్న భూమిలో ఎంత మేరకు వినియోగించుకుంటున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా సెంట్రల్‌ వర్సిటీలు తమకున్న భూమిలో 25-30 శాతానికి మించి ఉపయోగించుకోవడం లేదు. ఫలితంగా ఆ భూముల్లో అడవిలాంటి వాతావరణం ఏర్పడి, జంతుజాలాలకు ఆవాసంగా మారుతున్నాయి. బనారస్‌ హిందూ వర్సిటీకి 1300 ఎకరాలుండగా.. అందులో వినియోగంలో ఉన్నది 25 శాతం లోపే! హెచ్‌సీయూకు ఉన్న 1630 ఎకరాల్లో భవనాలు, తరగతి గదులు, హాస్టళ్లు, ల్యాబ్‌లు ఇలాంటి వాటన్నింటికీ కలిపి ఉపయోగిస్తున్నది 25 శాతం లోపేనని అంచనా. జేఎన్‌యూ, అలీగఢ్‌ ముస్లిం వర్సిటీలదీ దాదాపు ఇదే పరిస్థితి. ఆయా వర్సిటీలను స్థాపించి దశాబ్దాలు గడుస్తున్నా.. అందుబాటులో ఉన్న భూమి వినియోగం భారీగా పెరిగిన దాఖలాల్లేవు. విశ్వవిద్యాలయాలకు కేటాయించిన భూమిలో వినియోగం చాలా తక్కువగా ఉందని యూజీసీ నిపుణుల కమిటీ కూడా పేర్కొంది.


విద్యార్థుల సంఖ్యకు, విస్తీర్ణానికి పొంతన లేదు..

కేంద్రీయ విశ్వవిద్యాలయాల విస్తీర్ణం విద్యార్థుల సంఖ్యను బట్టి ఉండాలన్న ప్రమాణాలు కూడా ఏమీ లేవు. ఉదాహరణకు 1000 ఎకరాల్లో ఉన్న జేఎన్‌యూలో 8800 మంది విద్యార్థులుంటే.. 600 ఎకరాలున్న అసోం సెంట్రల్‌ వర్సిటీలో 10 వేల మంది ఉన్నారు. 300 ఎకరాల్లో ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బిహార్‌లో 4000 మంది విద్యార్థులుంటే.. అంతకు ఐదున్నర రెట్ల విస్తీర్ణంలో ఉన్న హెచ్‌సీయూలో ఉన్నది 5000 మందే. 655 ఎకరాల్లో ఉన్న గురు ఘాసీదాస్‌ విశ్వవిద్యాలయంలో 8256 మంది ఉన్నారు. ఇక్కడ కూడా హెచ్‌సీయూ కంటే ఎక్కువ మందే ఉండడం గమనార్హం. అంటే విద్యార్థుల సంఖ్యకు, భూమికి పొంతనే లేదన్నమాట!


యూజీసీ నివేదిక ఏం చెప్పింది?

ఉన్నత విద్యా సంస్థలకు భూ కేటాయింపులపై యూజీసీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2024లో నివేదిక ఇచ్చింది. అందులో ఏ తరహా వర్సిటీలకు ఎంత భూమి ఉండాలో సిఫారసు చేసింది. సెంట్రల్‌ వర్సిటీలకు 500 ఎకరాలు అవసరమని చెప్పింది. రాష్ట్రాల పరిధిలో ఏర్పాటు చేసే వర్సిటీలకు భూ కేటాయింపు స్థానిక చట్టాలను బట్టి ఉంటుందని, ప్రైవేటు వర్సిటీల విషయంలోనూ రాష్ట్ర చట్టాల నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది. డీమ్డ్‌ వర్సిటీల విషయంలోనూ పలు సూచనలు చేసింది. జాతీయ విద్యా విధానం-2020 మేరకు రాష్ట్ర స్థాయి వర్సిటీలకు కనీసం 20 ఎకరాలు ఉండాలంది. ఆయా వర్సిటీల్లో కనీసం 3000 మంది విద్యార్థులు ఉండాలని తెలిపింది. అదే సమయంలో మెట్రోపాలిటన్‌ నగరాలు, కొండ ప్రాంతాల్లో వర్సిటీల ఏర్పాటుకు 10 ఎకరాలు ఉండాలని, మరో 3 ఎకరాలు ఖాళీ స్థలం ఉండాలని సూచించింది. పచ్చదనం కోసం కూడా కొంత భూమి ఉండాలని, అది కూడా 3 ఎకరాల వరకు ఉండొచ్చని తెలిపింది. ఓపెన్‌ యూనివర్సిటీలకు 5 ఎకరాలు ఉండాలని సూచించింది.


2014 నాటి కేంద్ర ఉత్తర్వుల ప్రకారం..

ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీల ఏర్పాటుకు ఎంత భూమి అవసరం? ప్రస్తుతం ఎంత కేటాయించాల్సి వస్తోంది? అనే అంశాలపై 2014 అక్టోబరులో కేంద్ర ఉన్నత విద్యా సంస్థలకు భూ కేటాయింపులను నిర్ణయించే కమిటీకి కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. దాని ప్రకారం ప్రస్తుతం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ)కి 100 ఎకరాలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌)లకు 200 ఎకరాలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లకు 300 ఎకరాలు అవసరమవుతున్నట్లు తెలిపింది. అలాగే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), సెంట్రల్‌ వర్సిటీల ఏర్పాటుకు 500 ఎకరాలు అవసరం ఉండగా.. ఆ స్థాయిలో భూములు లభించడం లేదని పేర్కొంది. పెద్దఎత్తున భూములు సేకరించడం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కష్టతరంగా మారిందనే విషయాన్ని ప్రస్తావించింది. ఫలితంగా అనేక కేంద్ర ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపింది. కాగా, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలంటే దాదాపు 500 ఎకరాలు అవసరమవుతుందని గతంలో రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు నాటి కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సమాధానం ఇచ్చారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో భూ పరిమాణంలో మార్పులుంటాయని కూడా చెప్పారు.


కొన్ని వర్సిటీలకు ప్రత్యేకంగా భూముల్లేవ్‌..

దేశంలో మొత్తం 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉండగా వాటిలో కొన్నింటికి ప్రత్యేకంగా భూముల్లేవు. ఉదాహరణకు ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ కూడా సెంట్రల్‌ వర్సిటీయే. కానీ, దీనికి ప్రత్యేకంగా భూమి లేదు. ఓయూ ప్రాంగణంలోనే ఇది కూడా ఉంది. అన్ని కోర్సులు, విభాగాలు లేకపోవడం.. కేవలం భాషలు నేర్చుకునేందుకే దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రత్యేకంగా భూమిని కేటాయించలేదు. ఇలాంటివి కాకుండా అన్ని విభాగాలు, కోర్సులు ఉన్న సెంట్రల్‌ వర్సిటీల్లోనూ 23 వర్సిటీలు 500 ఎకరాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయి.


ఆ 2 వర్సిటీలకు సొంత స్థలం లేదు!

రాష్ట్రంలోని కొన్ని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు లీజు భూముల్లోనే నడుస్తున్నాయి. కొన్నింటికి భారీగా భూములుండగా.. మరికొన్ని లీజు స్థలాల్లోనే కొనసాగుతున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌ను కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో 88 ఎకరాల బోర్డు స్థలాన్ని లీజుకు తీసుకొని ప్రారంభించారు. వర్సిటీ ఏర్పడి 50 ఏళ్లయినా సొంత భూమి సమకూరలేదు. అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి చదువుకున్న జేఎన్‌ఏఎ్‌ఫఏయూ (జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ)కి కూడా సొంత భూమి లేదు. మాసబ్‌ట్యాంక్‌లోని ఈ యూనివర్సిటీ పర్యాటక శాఖకు చెందిన ఐదెకరాల్లో లీజు పద్ధతిలో కొనసాగుతోంది. కేవలం ఐదెకరాలే ఉండడంతో విద్యార్థుల హాస్టళ్లకు స్థలం లేకుండా పోయింది. ఈ యూనివర్సిటీకి అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 10 ఎకరాలు కేటాయిస్తూ గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిపై అంబేడ్కర్‌ వర్సిటీ సిబ్బంది నిరసనలు తెలపడంతో ఆ ప్రక్రియ ముందుకెళ్లలేదు.

దేశంలోని కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు,

వాటి విస్తీర్ణం, విద్యార్థుల సంఖ్య

వర్సిటీ విస్తీర్ణం విద్యార్థులు

జేఎన్‌యూ 1019 10000

హెచ్‌సీయూ 1630 5500

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ 302 1408

అస్సాం యూనివర్సిటీ 600 10,000

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బిహార్‌ 300 4000

నలంద 455 1038

మహాత్మాగాంధీ సెంట్రల్‌ వర్సిటీ 310 1000

గురు ఘాసిదాస్‌ 655 8256

జామియా మిల్లియా 254 24183

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గుజరాత్‌ 100 1343

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ 150 4238

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కశ్మీర్‌ 500 1139

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఝార్ఖండ్‌ 510 1000

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ 310 2500

బనారస్‌ హిందూ యూనివర్సిటీ 1300 18000

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ(అనంతపురం) 491 1500


ఈ వార్తలు కూడా చదవండి..

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 03:45 AM