Yadagirigutta: యాదగిరీశుడికి స్వర్ణ గోపుర శోభ
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:43 AM
భక్తుల కొంగుబంగారమై యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి బంగారు గోపుర ఆవిష్కరణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది.

50.5 అడుగుల ఎత్తైన పంచతల గోపుర తాపడానికి.. 68కిలోల పసిడి వినియోగం
సీఎం రేవంత్ దంపతుల ప్రత్యేక పూజలు
5 రోజులుగా గుట్టపై జపాలు, పారాయణలు హోమాలతో ఉత్సాహపూరిత వాతావరణం
ఆదివారం దివ్య విమాన రాజగోపురానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం
సీఎం పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, మంత్రుల గైర్హాజరుపై చర్చ
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): భక్తుల కొంగుబంగారమై యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి బంగారు గోపుర ఆవిష్కరణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ అమృత ఘడియల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భక్తజనకోటికి స్వర్ణమయ దివ్య విమాన రాజగోపురం దర్శనమిచ్చింది. ఐదురోజులుగా జపతపాదులు, హోమాలు, పారాయణలు, వేదమంత్ర పఠనంతో గుట్టపై నెలకొన్న ఉత్సవపూరిత వాతావరణం.. ఆదివారం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంతో పతాకస్థాయికి చేరింది. ఈ వేడుకల్లో భాగంగా యాగశాలలో నిర్వహించిన మహాపూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు. అసలు ఘట్టమైన స్వామివారి స్వర్ణ దివ్య విమాన రాజగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం.. వానమామలై మఠం 31వ మధుర కవి పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మొదలైంది. జీయర్ అనుమతితో ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు మహాకుంభ కలశాన్ని శిరసున దాల్చి ఐదు అంతస్తుల ఎత్తున ఉన్న స్వర్ణ గోపురం వరకూ సుమారు 126 మెట్లెక్కారు. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు క్రతువులో పాల్గొని స్వామివారి స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. 50.5 అడుగుల ఎత్తు, 10.759 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న విమాన గోపురానికి స్వర్ణతాపడం చేసేందుకు..68 కిలోల బంగారాన్ని వినియోగించారు.
మహోత్సవం కొనసాగిందిలా...
ఉదయం 11.09 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠద్వారం వద్దకు.. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు వెంట కొండపైన అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ సంప్రదాయ దుస్తులు ధరించి లిఫ్ట్ ద్వారా తిరువీధిలోకి చేరుకుని యాగశాలను సందర్శించి మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. 14 నదుల నుంచి సేకరించిన నదీ జలాలతో కూడిన కలశంతో ఉత్తర రాజగోపురం నుంచి దక్షిణ తిరువీధిలో ఏర్పాటు చేసిన మెట్లదారి నుంచి స్వర్ణ గోపురం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మెట్లెక్కి.. పూలతో అల్లిన తాడు సహాయంతో.. స్వర్ణ దివ్య విమాన (గాలి) గోపురాన్ని సీఎం 11.54 గంటలకు ఆవిష్కరించారు. అనంతరం సుదర్శన చక్రానికి నదీ జలాలతో మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడినుంచి త్రితల గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి, గండభేరుండ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలకగా.. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు శేష వస్త్రాన్ని కప్పి ఆశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు లడ్డు ప్రసాదం, స్వామివారి చిత్రపటం, స్వర్ణ గోపుర జ్ఞాపికను అందజేశారు. అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం వెంట ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, బాలునాయక్, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కానీ.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి నల్లగొండ ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ ఎన్. శ్రీధర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం పర్యటనకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి చరమూర్తులు కొలువైన ఉప ఆలయంలో ఆదివారం విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనంతో మహాశివరాత్రి మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం పలికారు.
కార్యకర్తల హంగామా
గుట్టపై సీఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా చేస్తూ భద్రత సిబ్బందితో రెండు చోట్ల గొడవకు దిగారు. దక్షిణ తిరువీధిలో పైకి ఎక్కేటప్పుడు భద్రత సిబ్బంది వారిని నిలిపివేయగా కార్యకర్తలు పైకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. సీఎం లిఫ్ట్‌లో అతిథిగృహానికి వెళ్లేటప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది. సిబ్బంది ప్రతిఘటించడంతో కార్యకర్తలు హంగామా చేశారు.
దాతలు రాక ఖాళీగా కుర్చీలు
స్వర్ణ దివ్య విమాన గోపురానికి బంగారం, నగదు విరాళంగా అందజేసిన దాతల కోసం తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాట్లు చేశారు. కానీ, దాతలు రాకపోవడంతో.. చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
భక్తుల ఇబ్బందులు
సీఎం పర్యటన సందర్భంగా.. ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సర్వదర్శనాలను రద్దు చేయడంతో భక్తులు.. మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చంటిపిల్లలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొండపైన, కింద, ఆర్టీసీ బస్టాండ్‌లో భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది.