Share News

KTR on HYDRAA: పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా?.. కేటీఆర్ ఫైర్

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:56 PM

హైడ్రాపై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఒక్కరిపై కూడా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా(HYDRAA) చేసేది మంచే అయితే భట్టి విక్రమార్క చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవని మండిపడ్డారు.

KTR on HYDRAA: పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా?.. కేటీఆర్ ఫైర్
KTR on HYDRAA

హైదరాబాద్‌, నవంబర్ 2: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హయాంలో నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)అన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశామని చెప్పారు. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదని దుయ్యబట్టారు. 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. నగరంలో హైడ్రా బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా? అంటూ హైడ్రాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైడ్రా ఎగ్జిబిషన్ ప్రోగ్రాంలో భాగంగా హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ భవన్‌లో ఆదివారం కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


హైడ్రాపై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఒక్కరిపై కూడా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా(HYDRAA) చేసేది మంచే అయితే భట్టి విక్రమార్క చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవని మండిపడ్డారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్‌హౌస్ చెరువు మధ్యలో ఉందని చెప్పారు. శాసన మండల చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉందన్నారు. వీరిపై చర్యలు ఉండవు కానీ.. సున్నం చెరువు వద్ద పేదల ఇళ్లను మాత్రం వెంటనే కూల్చి వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గాజులరామారం వద్ద బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi) భూమిని అలానే ఉంచారని.. పేదల ఇల్లు మాత్రం కూల్చివేశారని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టే ఆయన భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారని చెప్పారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు, అధికారులు ఎందుకు కూల్చలేదన్నారు.


యూపీలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా కూల్చివేతలు తప్పన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కూల్చేస్తున్నారని ఆగ్రహించారు. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్‌‌తో తమ బాధను బాధితులు వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు లేకుండానే తమ ఇళ్ళను హైడ్రా అధికారులు కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో రోడ్డును పడ్డామన్నారు.


ఇవి కూడా చదవండి:

KTR: మణుగూరు పార్టీ కార్యాలయ దహనం చేసిన ఘటనపై కేటీఆర్ ఫైర్

Kavitha: జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ.. ప్రకటించిన కవిత

Updated Date - Nov 02 , 2025 | 12:59 PM