BRS Population Control: ‘పునర్విభజన’తో దక్షిణాదికి నష్టం
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:58 AM
జనాభా నియంత్రణ అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
అన్యాయం జరగనివ్వబోమని చెప్పే కేంద్ర సర్కార్‌పై మాకు నమ్మకంలేదు
మేము తెలుగు భాషను ఎవరిపై రుద్దనప్పుడు.. హిందీని ఇతరులపై రుద్దే ప్రయత్నం ఎందుకు?: కేటీఆర్
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జనాభా నియంత్రణ అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన టాక్ జర్నలిజం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల తరఫున వారి సమస్యలను పార్లమెంటులో సమర్థంగా వినిపించడానికే రాజ్యాంగంలో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని పొందుపర్చారన్నారు. జనాభా ఆధారంగా పార్లమెంటులో ఆయా రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో గతంలో ప్రతి పదేళ్లకు జనగణన, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టేవారన్నారు. అయితే జనాభా విపరీతంగా పెరగడం కారణంగా 1971లో రాజ్యాంగ సవరణ చేసి లోక్‌సభ స్థానాలను 543కు పరిమితం చేసినట్లు చెప్పారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామన్నారని, ఈలోపు దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన కారణంగా ఇక్కడి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశంలేదన్నారు.
దీంతో ఉత్తర భారతదేశ ఎంపీల సంఖ్య పెరిగి.. అక్కడి వారి ఆధారంగానే కేంద్రప్రభుత్వం ఏర్పడితే.. దక్షిణ భారతదేశ ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉండదన్న అనుమానం వ్యక్తంచేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పే మాటలను తాము నమ్మడం లేదన్నారు. ఎందుకంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎమ్మెల్యే స్థానాల పెంపుపై దృష్టి పెట్టలేదని, బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్, అసోం రాష్ట్రాలలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచిందని ఆరోపించారు. మందబలం, అధికారం ఉందన్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేవలం హిందీ నేర్చుకొని అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు వెళ్లి ఏమీ చేయలేమని చెప్పారు. తాము ఎవరిపై తెలుగు భాషను రుద్దనప్పుడు వాళ్లు ఎందుకు హిందీని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా, ప్రకృతి సహకరించకున్నా.. పంటల సాగుకు సిద్ధపడ్డ రైతులు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారని, వారి కష్టాలను కాంగ్రెస్ సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, వాసుదేవరెడ్డి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఓవైపు కేంద్రమంత్రి సేంద్రియ వ్యవసాయం చేయాలంటున్నారని, మరోవైపు కేంద్రం నుంచి ఎరువులు వస్తేనే తాము పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయరంగంపై నిర్లక్ష్యం వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందే అని వారు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News