KTR: థర్డ్‌క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదు!
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:59 AM
ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు కోరుతూ ఏ కూటమి కూడా తమను సంప్రదించలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తమది స్వతంత్ర పార్టీ అని.. ఢిల్లీలో బాస్‌లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ కూటమీ సంప్రదించలేదు
యూరియా ఇచ్చిన పార్టీ అభ్యర్థికే మద్దతిస్తాం: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు కోరుతూ ఏ కూటమి కూడా తమను సంప్రదించలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తమది స్వతంత్ర పార్టీ అని.. ఢిల్లీలో బాస్‌లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎన్డీయే, ఇండి సహా ఏ కూటమితోనూ తమకు సంబంధం లేదని చెప్పారు. బుధవారమిక్కడ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘మాకు మోదీ బాస్ కాదు.. రాహుల్ కూడా కాదు.. వారు చెప్పగానే మేం ఓట్లేస్తామా?’ అని ప్రశ్నించారు. ఒకవేళ కాంగ్రెస్ తరఫున అభ్యర్థి రేవంత్‌రెడ్డి పెట్టిన వ్యక్తయితే కచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అనే చిల్లర పార్టీ రాష్ట్ర ప్రజలను ఎంత అరిగోస పెడుతుందో అందరికీ తెలుసన్నారు. అలాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, పార్టీ పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ మాటలకే పరిమితమయ్యారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీనే ప్రకటించేవారని అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎవరికి మద్దతివ్వాలనేది ఇంకా నిర్ణయించలేదని, సెప్టెంబరు 9లోపు సమావేశమై తమ వైఖరి ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైనా సరే.. వచ్చే నెల 9లోపు 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి తేవాలని డిమాండ్ చేశారు. ఓటింగ్‌లోపు రాష్ట్రానికి యూరియా తెచ్చిన పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తామని ఆయన ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కోసం కేసీఆర్‌ను కలుస్తానంటున్న రేవంత్‌రెడ్డి.. ముందు కలవాల్సింది కష్టాల్లో ఉన్న రైతులనని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News