KTR: అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రం చేశారు: కేటీఆర్
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:16 AM
కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని, అన్నపూర్ణగా ఉన్న తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

హైదరాబాద్, పిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని, అన్నపూర్ణగా ఉన్న తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో రైతులకు కష్టాలే మిగిలాయని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. సాగునీళ్లు, విద్యుత్ సక్రమంగా ఇవ్వడంలేదని, పండిన పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, రైతుభరోసా, రుణమాఫీ రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను.. కేసీఆర్ పదేళ్ల పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలబెడితే.. కాంగ్రెస్ సర్కార్ పూర్వస్థితికి తెచ్చిందని విమర్శించారు.
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేశారని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులురాక, చేసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఇది ప్రజాపాలనకాదు ప్రజలను వేధించే పాలన అని ఆయన ఆరోపించారు. కాగా, భారత అండర్-19 మహిళా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించడం చారిత్రక సందర్భమని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీ్‌సగా నిలిచి జట్టును ముందుండి నడిపించారని ప్రశంసించారు.