Share News

KTR: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:56 AM

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. పార్లమెంట్‌ ఎదుట విజయ్‌ చౌక్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

KTR: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు

  • ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

  • యూజీసీ నూతన నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

  • రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, హక్కులను హరిస్తే ఊరుకోం

  • ఢిల్లీలో మీడియాతో కేటీఆర్‌ ధర్మేంద్ర ప్రధాన్‌, గడ్కరీతో భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. పార్లమెంట్‌ ఎదుట విజయ్‌ చౌక్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని, వారికి నోటీసులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడేలా సుప్రీంకోర్టులో కొట్లాడతామన్నారు. అంతకుముందు ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలతో కేటీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ బృందం సమావేశమైంది. సిరిసిల్ల వరకు నిర్మాణమవుతున్న జాతీయ రహదారి 365-బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని గడ్కరీని కోరామన్నారు. మిడ్‌ మానేరు మీదుగా రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జిను ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారి 63ని దానితో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్థమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్‌ కమిటీల బాధ్యతను గవర్నర్లకు అప్పగించడం సరికాదన్నారు. దేశంలో రాష్ర్టాల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్థంగా నిబంధనలు తెస్తే సహించేది లేదన్నారు. యూజీసీ నిబంధనల్లో మార్పులపై బీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని ఆరు పేజీలతో కూడిన విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కేటీఆర్‌ అందజేశారు. రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి హక్కులకు భంగం వాటిల్లకుండా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించాలని కేటీఆర్‌ కోరారు. కేంద్రమంత్రులను కలిసిన బీఆర్‌ఎస్‌ బృందంలో ఎంపీలు సురేష్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌ రావు, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సంజయ్‌ కుమార్‌ తదితరులున్నారు.


రాష్ట్రంలో పడకేసిన పాలన

రాష్ట్ర సచివాలయంలోనే కాక గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని, ప్రజల కష్టాలు తీరేదెలాగంటూ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలన పల్లె ప్రజలకు కష్టాలు తెచ్చిందన్నారు. సీఎం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యలను తీర్చాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 07 , 2025 | 03:56 AM