KTR: కాంగ్రెస్ మాఫియా రాజ్యం..
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:28 AM
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం అవినీతి, భూఆక్రమణలు, సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయిందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సెటిల్మెంట్లకు కేంద్రంగా రేవంత్‌రెడ్డి ఇల్లు.. తుపాకీ సంస్కృతి ఆరోపణలపై సీఎం స్పందించాలి
మంత్రి వేధింపులు భరించలేకనే రిజ్వీ వీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం అవినీతి, భూఆక్రమణలు, సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయిందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యంగా మారిందని, సీఎం రూ.వేల కోట్లు పోగేసుకుంటుంటే తాము వందల కోట్లయినా సంపాదించొద్దా.. అంటూ మంత్రులు పోటీ పడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్‌ఖాన్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కేసీఆర్‌లాంటి సెక్యులర్ నేత ఎవరూ లేరని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఇదేతీరు కొనసాగుతోందన్నారు. మంత్రుల మధ్య అవినీతి సొమ్ముల పంపకాలు, టెండర్ల రిగ్గింగ్ వంటివి.. కాంగ్రెస్ ఇంటి పంచాయితీలుగా మారాయన్నారు. ఇంత బహిరంగంగా దేశచరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. పొంగులేటి తమ టెండర్లలో తలదూర్చారని ఓ మంత్రి కుమార్తె ఆరోపించారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఆయన అనుచరుడు రోహిన్‌రెడ్డి ఓ పారిశ్రామికవేత్త నెత్తిన గన్నుపెట్టి బెదిరించారంటూ ఆమె చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే స్పందించాలన్నారు. మంత్రి కూతురు ఆరోపణలుచేేస్త ఆ మంత్రిని తొలగించలేని బలహీనమైన ఇలాంటి సీఎంను ఇప్పటివరకు చూడలేదన్నారు. దావూద్ ఇబ్రహీంలాంటి ఈ సీఎంను తరిమేస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. భాగస్వాములైతే, గతంలో మాదిరిగానే జైలుకు వెళ్లాల్సివస్తుందని అధికారులను హెచ్చరించారు.
ఓ మంత్రి వేధింపులు భరించలేకనే ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎ్‌సకు సిద్ధపడ్డారన్నారు. తాను చెప్పినపని చేయలేదన్న ఉద్దేశంతో.. ఆయన రాజీనామాను ఆమోదించొద్దని జూపల్లి కృష్ణారావు కోరడం ప్రభుత్వ వేధింపులకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతల వాటాల పంచాయితీలో తమకు భాగస్వామ్యం వద్దని అధికారులు పారిపోతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో దండుపాళ్యం ముఠా రాష్ర్టాన్ని నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అక్రమాల్లో
డీజీపీ ఏం చేస్తున్నారు?
తమకు పింక్, రెడ్ బుక్కుల్లేవని రాష్ట్రంలో ఖాకీ బుక్కు మాత్రమే ఉంటుందని గొప్పలకు పోయిన డీజీపీ ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తమ కార్యకర్తలను జైల్లో పెట్టిన పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వెతుకుతున్న నిందితుడిని అరెస్టు చేయొద్దంటూ మంత్రి కుమార్తె ఆపినా, అతన్ని స్వయంగా మంత్రి తన కారులో తీసుకెళ్ళిపోయినా చర్యల్లేవన్నారు. మంచిరేవుల భూముల వ్యవహారంలో సీఎం సోదరుడు బెదిరించారని, తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, తెచ్చింది రోహిన్‌రెడ్డి అని మంత్రి కుమార్తె చెబుతున్నారు. పోలీసులు మాత్రం గన్ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది కొండా సురేఖ ఓఎ్‌సడీ సుమంత్ అని చెబుతున్నారన్నారు. ఈ రెండు అంశాల్లోనూ డీజీపీ చర్యలు తీసుకుని తన చిత్తశుద్థి నిరూపించుకోవాలన్నారు. ఈ అంశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయాన్ని రికార్డు చేయాలని, సుమంత్‌ను విచారించి నిజానిజాలు బయటపెట్టాలన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ పరిపాలన నడుస్తోందని.. అందుకే ఇక్కడి అవినీతి, అరాచకాలపై కేంద్ర మంత్రులు, ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజం చెప్పారని, తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు ఆయనకు తమ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News