Share News

Krishna River Godavari River: సాగర్‌ దిశగా కృష్ణమ్మ

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:25 AM

ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్‌నూ జలసిరితో ఉప్పొంగించేందుకు బిరబిరా పరుగు తీస్తోంది.

Krishna River Godavari River: సాగర్‌ దిశగా కృష్ణమ్మ

ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్నీ నిండు కుండలా..

  • సాగర్‌లోకి 98వేల క్యూసెక్కుల వరద

  • సామర్థ్యం 312 టీఎంసీలు.. ప్రస్తుతం 276 టీఎంసీలు

  • గోదావరి ప్రాజెక్టులకు పుంజుకోని వరద

  • కాళేశ్వరం వద్ద 9 అడుగుల ఎత్తులో.. భద్రాద్రి వద్ద 26 అడుగుల ఎత్తులో..

  • ఇప్పటికే 1000 మిలియన్‌ యూనిట్లు దాటిన జల విద్యుదుత్పత్తి

  • ఆగని జల్లులు.. నేడూ కొన్ని జిల్లాల్లో వర్షాలు.. 29 దాకా ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్‌నూ జలసిరితో ఉప్పొంగించేందుకు బిరబిరా పరుగు తీస్తోంది. ప్రస్తుతం సాగర్‌లోకి 98,413 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 276.09 టీఎంసీల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగలైతే ఇప్పటికే 579 అడుగులకు నీరు చేరుకోవడం గమనార్హం. ప్రాజెక్టు నుంచి దిగువకు 6,134 క్యూసెక్కులను మాత్రమే వదులుతున్నారు. శ్రీశైలం నుంచి రెండు గేట్ల ద్వారా 1.57 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌ దిశగా వెళుతోంది. పులిచింతల కూడా నీటితో కళకళలాడుతోంది. పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలకు ప్రస్తుతం 19.70 టీఎంసీలల మేర నీటి నిల్వ ఉంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఇంకా పుంజుకోలేదు. ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో ప్రవాహం పెరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ త్రివేణి సంగమం వద్ద గోదావరి 9మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 26 అడుగులుగా నమోదైంది. ఇక.. ఈ సీజన్‌లో ముందే వరద వచ్చిచేరడంతో జలవిద్యుదుత్పాదన జోరందుకుంది. రాష్ట్రంలోని జలవిద్యుత్తు కేంద్రాల్లో ఇప్పటిదాకా 1,065 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రతిరోజు 28 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. జూరాలలో 4.19 మిలియన్‌ యూనిట్లు, లోయర్‌ జూరాలలో 4.59 మిలియన్‌ యూనిట్లు, శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో 17.75 మిలియన్‌ యూనిట్లు, నాగార్జునసాగర్‌ ప్రధాన కేంద్రంలో 1.61 మిలియన్‌ యూనిట్లు, నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ మీద ఉన్న కేంద్రంలో 0.52 మిలియన్‌ యూనిట్ల మేర ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీజన్‌లో 1065 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి కాగా, అత్యధికంగా 489 మిలియన్‌ యూనిట్లు శ్రీశైలంలో, ఆ తర్వాత నాగార్జునసాగర్‌లో 202 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. మరోవైపు... రాష్ట్రవ్యాప్తంగా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరులో 4.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 3 సెం.మీ, మెదక్‌ జిల్లా పాపన్నపేటలో 2.6సెం.మీ, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 2.5 సెం.మీ, యాదాద్రి జిల్లా పాముకుంట, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 1.8 సెం.మీ చొప్పున, నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలో 1.5 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా చొప్పదిండిలో 1.4 సెం.మీ, సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి, నారాయణపేట కోస్గిలో 1.3 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. సిద్దిపేట రూరల్‌లోని నారాయణపేటలో ఇంటిపైకప్పు, గోడ కూలిపోయింది. ఆసిఫాబాద్‌ జిల్లా చింతమానెపల్లి మండలం కర్జెల్లిలో ఓ ఇల్లు కూలిపోయింది.


ఆ 5 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు!

ఈనెల 29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు అప్పటివరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించడానికి జిల్లాల సందర్శనకు వెళ్లాలని ఉమ్మడి జిల్లాల ప్రత్యేకాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు.


సీనియర్‌ ఐఏఎ్‌సలను ఉమ్మడి జిల్లాల ప్రత్యేకాధికారులుగా నియమించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం నియామకాల ఉత్తర్వులను సీఎస్‌ జారీ చేశారు. అనంతరం వారితో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. వర్షాలు, రేషన్‌ కార్డుల పంపిణీ, యూరియా సరఫరా వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాలని వారిని సీఎస్‌ ఆదేశించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా వర్షాల నేపథ్యంలో ‘ఆపద మిత్రా’లను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు విపత్తు నిర్వహణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సూచించారు.

ప్రాజెక్టులు పూర్తిస్థాయి ప్రస్తుత ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో

సామర్థ్యం సామర్థ్యం

ఆల్మట్టి 129.72 102.65 32923 43140

నారాయణపూర్‌ 37.64 35.12 41580 57776

ఉజ్జయిని 117.24 114.64 5504 4093

జూరాల 9.66 8.11 65551 72067

తుంగభద్ర 105.79 78.07 26478 28397

శ్రీశైలం 215.81 203.43 110653 156863

నాగార్జునసాగర్‌ 312.05 276.09 98413 8986

పులిచింతల 45.77 19.70 681 400

జైక్వాడి 102.73 86.38 4250 2564

సింగూరు 29.91 19.46 1976 633

నిజాంసాగర్‌ 17.80 4.14 863 0

శ్రీరాంసాగర్‌ 80.50 21.54 2505 622

మిడ్‌మానేరు 27.50 6.95 955 110

లోయర్‌ మానేరు 24.03 6.40 955 214

కడెం 4.70 3.53 2256 1932

శ్రీపాద ఎల్లంపల్లి 20.18 9.33 3651 639


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:25 AM