Share News

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:00 AM

కొమురవెల్లిలో పట్నంవారం! ఈ వేడుక కోసమే హైదరాబాద్‌ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మల్లనస్వామికి పచ్చ, సునేరు, తెల్లపిండి, కుంకుమ, పసుపుతో పటం పరిచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

  • హైదరాబాద్‌ నుంచి పోటెత్తిన భక్తులు

  • మల్లన్న స్వామికి, ఎల్లమ్మ తల్లికి బోనాలు

చేర్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కొమురవెల్లిలో పట్నంవారం! ఈ వేడుక కోసమే హైదరాబాద్‌ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మల్లనస్వామికి పచ్చ, సునేరు, తెల్లపిండి, కుంకుమ, పసుపుతో పటం పరిచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానఘట్టమైన ఈ పట్నంవారం ఆదివారం ఘనంగా జరిగింది. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. డప్పు చప్పుళ్లు, డోలుపై ఢిల్లెం కల్లెం మోతల మధ్య శివసత్తుల శివాలు, పోతరాజుల విన్యాసాలతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. మల్లన్నకు, స్వామివారి సహోదరి ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలు తీశారు.


తాము బస చేసిన చోట, ఆలయ గంగరేగు చెట్టు వద్ద, ముఖమండపంలో మల్లన్న స్వామికి చిలుక పట్నం, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకొందరు మొక్కులతో గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. సంతానం కలిగించాలంటూ మహిళలు వల్లుబండ వద్ద వరంపట్టారు. పట్నంవారం సందర్భంగా ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు సోమవారం ఆలయ తోటబావి ప్రాంగణంలో పెద్దపట్నం వేసి అగ్నిగుండాలు నిర్వహిస్తారు. కాగా సౌకర్యాల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Updated Date - Jan 20 , 2025 | 04:00 AM