Komatireddy Venkat Reddy: ప్రత్యేక ప్రణాళికలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:40 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
హ్యామ్ రోడ్ల మంజూరులో ప్రాధాన్యం: మంత్రి కోమటిరెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, తుమ్మల హాజరు
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆదివారం ఖమ్మం జల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న అభివృద్థి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్టు తెలిపారు.
వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాలతో పాటు వరికోతల సీజన్ నడుస్తుండటంతో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలనే విషయంపై కూలంకషంగా చర్చించామన్నారు. ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో నిర్మించదల్చిన రోడ్ల మంజూరులో జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపైనా చర్చించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలను కోళ్ల ఫారమ్‌లలో నడిపించి నిరుపేదలను అవమానించారని, కానీ తాము అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు నిర్మించి విద్యలో అసమానతలు లేకుండా చేస్తున్నామని చెప్పారు.