Share News

Komatireddy Rajgopal Reddy: ఆ నలుగురు హామీ ఇచ్చారు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:39 AM

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.

Komatireddy Rajgopal Reddy: ఆ నలుగురు హామీ ఇచ్చారు

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్య.. ముఖ్యమంత్రిపై విమర్శల కొనసాగింపు

  • డీకే శివకుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్‌ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇటీవల ఎక్స్‌లో పోస్టు చేసిన రాజగోపాల్‌ రెడ్డి... సోషల్‌, డిజిటల్‌ మీడియాకు చెందిన ప్రతినిధులతో బుధవారం తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ తన భాష మార్చుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సూచించారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు రాష్ట్రంలో దోచుకు తింటున్నారని ఆరోపించారు. కమిషన్లు, నివేదికలు తప్ప 20 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. మరో మూడున్నరేళ్లు రేవంత్‌ రెడ్డే ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరన్నది అప్పుడు చూడొచ్చునన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా విషయంలో ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. మంత్రి పదవే కావాలి అనుకుంటే తనకు కేసీఆర్‌ ఎప్పుడో ఇచ్చేవారని తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రేమతోనే తాను తిరిగి పార్టీలోకి వచ్చానని చెప్పారు. వీలైనంత త్వరగా మంత్రివర్గవిస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజగోపాల్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.


మంత్రి పదవి హామీ ఇచ్చింది ఆ నలుగురే

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తామని ఎన్నికలకు ముందు అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధిష్ఠానం తరఫున తనకు హామీ ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. తనకు మంత్రి పదవి ఇస్తానన్నది ఏఐసీసీ అని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇందులో ఏం సంబంధమని ప్రశ్నించారు. కాగా, బీసీ రిజర్వేషన్ల అంశంలో దేశ రాజధాని ఢిల్లీలో తీరిక లేకుండా ఉన్న సీఎం రేవంత్‌కు రాజగోపాల్‌ వ్యవహారం తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, బీసీ ధర్నా ఏర్పాట్లలో ఉండడం వల్ల రాజగోపాల్‌ రెడ్డి అంశంపై తాము దృష్టి సారించలేదని కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ మల్లురవి న్యూఢిల్లీలోని విలేకరులతో బుధవారం అన్నారు. రాజగోపాల్‌ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని పేర్కొన్నారు.

డీకేతో రాజగోపాల్‌ రెడ్డి భేటీ

వ్యక్తిగత పని మీద బుధవారం హైదరాబాద్‌ వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రాజగోపాల్‌ రెడ్డి స్వయంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి భేటీ జరిగింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.


కొత్తగా రెడ్లకు చోటు కల్పించేందుకు అధిష్ఠానం ససేమిరా

నిజానికి మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి చోటు కల్పించే విషయంలో పార్టీలో సుదీర్ఘ చర్చే జరిగింది. అయితే, జనాభాలో ఎంతో.. అంత భాగస్వామ్యం అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో క్యాబినెట్లో అగ్రకులానికి చెందిన వారికి కొత్తగా చోటు కల్పించేందుకు అధిష్ఠానం విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి క్యాబినెట్లో ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉండగా మూడో వ్యక్తిగా రాజగోపాల్‌రెడ్డికి చోటు కల్పిస్తే అది బీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తికి దారి తీస్తుందని అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరికే క్యాబినెట్లో చోటు ఉంటుందని స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తామని భట్టి, మాణిక్‌రావ్‌ ఠాక్రే, సునీల్‌ కనుగోలు, మహేశ్‌గౌడ్‌ హామీ ఇచ్చారని రాజగోపాల్‌ రెడ్డి చెబుతున్నారు. అయితే, ఆ నలుగురు ఇచ్చిన హామీ అధిష్ఠానం పెద్దలకు తెలుసా లేదా అన్నది స్పష్టత లేదు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రె్‌సలో చేరిన నేతలకు సునీల్‌ కనుగోలు, ఠాక్రే ఎడా పెడా హామీలు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ హామీలే ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి గుదిబండలా మారాయని వాపోతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 04:39 AM