Kishan Reddy: కుల గణన కాదు.. కులాల సర్వే చేశారు
ABN , Publish Date - May 04 , 2025 | 03:37 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసింద ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.
తూతూ మంత్రంగా కాంగ్రెస్ కార్యక్రమం
రాజ్యాంగబద్ధంగా కుల, జనగణనచేస్తాం
దేశంలో మౌలిక వసతులకు రూ.లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసింద ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆ సర్వే కూడా తూతూమంత్రంగా ముగించిందని, బీసీలకు అన్యాయం చేసేలా ముస్లింలను బీసీ జాబితాలో చేర్చిందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కులగణనను రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం చేయాలని అన్నారు. తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టనుందని తెలిపారు. ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి ఇంటికి వెళ్లి పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ అభివృద్ధిని వేగవంతం చేయడంలో రోడ్లు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, టెలీ కమ్యూనికేషన్ రంగాల అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు. దేశంలోని 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రూ.లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని వివరించారు.
వాజ్‌పేయి హయాంలో ప్రారంభమైన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుల ప్రేరణతో మోదీ ప్రభుత్వం అనేక రాష్ట్ర రాజధానులను, జిల్లా కేంద్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తోందన్నారు. అప్పట్లో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుల విధానాన్ని కొన్ని పార్టీలు హేళన చేశాయని తెలిపారు. తెలంగాణలో 2014లో 2,500 కి.మీ. పొడవైన జాతీయ రహదారులు ఉండగా, ప్రస్తుతం 5,200 కి.మీ.కు పెరిగాయని వెల్లడించారు. పదేళ్లలో రూ.1,25,485 కోట్లను జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుల కింద తెలంగాణలో 4,500 కోట్లతో 136 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారంరాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. ఇందులో రూ.4,590 కోట్లతో 138 కి.మీ. మేర చేపట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, రూ.826 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు భూమి పూజ కార్యక్రమాలు ఉంటాయని కిషన్‌రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..