Kishan Reddy: ఉగ్రదాడులకు ప్రతి దాడి తప్పదు
ABN , Publish Date - May 26 , 2025 | 04:36 AM
ఉగ్రదాడుల్లో ప్రజలు చనిపోతే నివాళులర్పించే విధానానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం స్వస్తి పలికిందని.. దాడి చేస్తే ప్రతి దాడి తప్పదని..
రాహుల్ ఎవరి వైపు మాట్లాడుతున్నారు?: కిషన్‌రెడ్డి
బేగంపేట/హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఉగ్రదాడుల్లో ప్రజలు చనిపోతే నివాళులర్పించే విధానానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం స్వస్తి పలికిందని.. దాడి చేస్తే ప్రతి దాడి తప్పదని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఒకరిని చంపితే వంద మందిని చంపుతామని చూపించామని తెలిపారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌ను ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గంలో ప్రజలు, బీజేపీ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. 46 ఏళ్లుగా పాక్ ఉగ్రవాదాన్ని భారత్‌పై ఎగదోస్తూ అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటోందని అన్నారు. ఈ దాడులు జరిగినప్పుడు నివాళులర్పించి సరిపెట్టుకునే వాళ్లమని.. కానీ 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక సర్జికల్ స్ర్టైక్స్, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని కూడా మట్టి కరిపిస్తామనే గట్టి సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటనలను చూస్తే.. ఆయన మన సాయుధ దళాల స్థైర్యాన్ని బలహీనపరచడానికి, స్వదేశీకరణ ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇతర దేశాల డ్రోన్లను ప్రశంసించడం నుంచి రాఫెల్ కొనుగోలును ఒక కుంభకోణంగా మాట్లాడటం వరకు.. అగ్నివీర్‌ను విమర్శించడం నుంచి మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలను దెబ్బతీయడం వరకు రాహుల్ ఎప్పుడూ భారత్ తరఫున మాట్లాడలేదని స్పష్టం చేశారు. మరి ఆయన ఎవరి తరఫున మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కేటీఆర్ ఆధిపత్యంపైనే కవిత లేఖాస్త్రం
బీఆర్‌ఎ్‌సలో కేటీఆర్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు కవిత లేఖాస్త్రాన్ని సంధించిందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కేటీఆర్‌ను కవిత సవాలు చేస్తూ, కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించనని చెప్పకనే చెబుతున్నారని అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కవిత స్థాపించే రాజకీయ పార్టీతో ఒరిగేదేమీ ఉండదని, అస్తిత్వం కోసమే ఆమె ఆరాటపడుతోందని తెలిపారు. కాగా, ‘కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతుల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందా..?’ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ స్పష్టం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరోవైపు ప్రాజెక్టు పునరుద్ధరణ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కాంట్రాక్టు సంస్థలు లేఖ రాయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం