Kishan Reddy: కాంగ్రెస్ కుట్ర ఫలించలేదు
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:43 AM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ దుష్ప్రచారాన్ని జనం పట్టించుకోలేదు
మంత్రులకు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు
ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీనే
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయకుండా, తమపై ఎదురుదాడి చేశారని మండిపడ్డారు. పదేళ్లు తామే అధికారంలో ఉంటామని చెప్పిన కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని విమర్శించారు. ‘ఇది రెఫరెండమా..? కాదా..? రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతనా..?’ అన్నది కాంగ్రెస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. గెలిచిన అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, సూర్యనారాయణగుప్తాతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అఽధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో తాము మరికొంత కష్టపడి ఉంటే మరిన్ని ఎంపీ సీట్లు వచ్చేవని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరతాయని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. ప్రజల ఆశలపై నీళ్లు చల్లాయని విమర్శించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం అభినందనీయమన్నారు. 37 శాతం మంది బీజేపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల పనికిరాని మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అవకాశవాదంతో ఒకరితో ఒకరు కలిసిన చరిత్ర ఆ పార్టీలదని మండిపడ్డారు. తమకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తే అది ప్రజలను అవమానించినట్లేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఓడిపోయిన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే ప్రస్తుత ఎజెండా అని కిషన్‌రెడ్డి ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్సీలకు మోదీ అభినందన..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి అద్వితీయ మద్దతు ఇచ్చి ఆశీర్వదించారని ప్రధాని మోదీ అన్నారు. ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మధ్య కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని మోదీ పేర్కొన్నారు. ఎమ్మెల్సీలుగా గెలిచిన మల్క కొమురయ్య, అంజిరెడ్డిలను అభినందించారు.
రేపు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ రాక
బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ శనివారం హైదరాబాద్ రానున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడిపై త్వరలో ప్రకటన వెలువడవచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో, బన్సల్ కొంతమంది సీనియర్ నాయకుల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.