Kishan Reddy: సీఎం తాటాకు చప్పుళ్లకు భయపడను
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:53 AM
పాలన వైఫల్యాలు, పార్టీలో, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, కేంద్రాన్నీ బద్నాం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు.
రేవంత్‌రెడ్డివి దివాలాకోరు వ్యాఖ్యలు
గ్యారెంటీలు, హామీలపై మాట్లాడరెందుకు?
కాంగ్రె్‌సలో, ప్రజల్లో సీఎంపై వ్యతిరేకత కప్పిపుచ్చడానికి నాపై, బీజేపీపై నిందలు
రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నా: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): పాలన వైఫల్యాలు, పార్టీలో, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, కేంద్రాన్నీ బద్నాం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అసహనం, బాధ్యతారాహిత్యంతో రేవంత్ చేసిన ఆరోపణలు ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, రేవంత్‌పై అసంతృప్తి.. ఆయన మాటల్లో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. తననో, బీజేపీనో బ్లాక్‌మెయిల్ చేయడం లేదా బెదిరించినంత మాత్రాన ఆయనపై వచ్చిన వ్యతిరేకత తగ్గిపోదని స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే కొన్ని పథకాలు అమలు చేయలేకపోయామని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణలో కేంద్రం అమలు చేసిన సుమారు 10 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు సంబంధించి రెండుసార్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రాజెక్టులకు సహకరించా..
కేంద్ర మంత్రులను తాను బెదిరిస్తున్నట్లు రేవంత్ చేసిన ఆరోపణలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌పై కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే అజ్ఞానులం కాదని అన్నారు. ఖాళీ పాత్రలే పెద్ద శబ్ధం చేస్తాయని.. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడనని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను అమలు చేయకుండా కేంద్రంపై, తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, పది పంటలకు బోన్‌సతో పాటు 2024 డిసెంబరు లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలపై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులకు రూ.1.66 లక్షల కోట్లు ఇవ్వాలని రేవంత్ తనను కోరారని.. మరి ఆ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఆయనెంత కేటాయించారని ప్రశ్నించారు. డిసెంబరు 12న సీఎం రేవంత్‌రెడ్డి తనకు రూ.1.66 లక్షల కోట్ల ప్రాజెక్టుల ప్రతిపాదనల లేఖ ఇచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. సీఎం ప్రస్తావించిన అంశాలపై సంబంధిత మంత్రులకు తాను ఉత్తరాలు రాశానని.. ఆ కాపీలను రేవంత్‌కు పంపించానని వెల్లడించారు. తాను నిబద్ధతతో పనిచేస్తున్నా.. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని రేవంత్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నర నెలల్లోనే రూ.1.66లక్షల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ మంజూరవుతాయా..? అని ప్రశ్నించారు. రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణకు రూ. 2,585కోట్లు జమచేయాలని 2024 జనవరి 1న లేఖ రాసినా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ మొదటి దశ క్యాబినెట్‌కు వెళుతుందని వెల్లడించారు. రెండోదశ పనులను తామే చేసుకుంటామని రేవంత్ ప్రకటించి, ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. ‘‘గతంలో ప్రతిపాదించిన మెట్రో రెండో దశ రూట్ మ్యాప్ సమగ్రంగా లేదని, తాము కొత్త ప్రతిపాదనలు ఇచ్చే వరకు దానిని ఆపాలని 2024 జనవరి 4న సీఎం ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రి హర్‌దీ్‌పసింగ్ పురీకి లేఖ ఇచ్చారు. తొలి ప్రతిపాదనను రద్దుచేయించిన రేవంత్ ప్రభుత్వం, కొత్త ప్రతిపాదనను 2024 అక్టోబరు 26న ఆమోదించింది. సొంత ప్రాజెక్టు ప్లానింగ్, ఆమోదానికే మీకు 10 నెలలు పట్టింది. కానీ, మూడు నెలల్లోనే కేంద్రం దీనిని ఆమోదించలేదని, నేను అడ్డుకున్నానని ఎలా విమర్శిస్తారు..? మెట్రో పనులను కేంద్రం కొనసాగిస్తుంది. మీ ముఖం చూసో, నేను అడ్డుకుంటున్నాననో పనులు ఆగవు’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.
రేవంత్ గాలి మాటలు..
జనాభా లెక్కల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పునర్విభజనకు కమిటీ ఏర్పాటవుతుందని, అది మేధావులతో పాటు సీఎం రేవంత్ సలహా కూడా తీసుకుంటుందని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు వెళ్లి ఆటంకం కలిగించవద్దని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే, కొంతమంది తమను ప్రశ్నించారు కాబట్టే బీజేపీ ఎమ్మెల్యేలను అక్కడికి పంపించామని కిషన్‌రెడ్డి వివరించారు.