ఆర్ అండ్ బీలో కీలక పోస్టులు ఖాళీ
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:50 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో రెండు కీలక పోస్టులు, ఇదే శాఖకు అనుబంధంగా ఉండే నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (న్యాక్)లో మరో ముఖ్యమైన పోస్టు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ ఎప్పుడన్నది తెలియడం లేదు. పూర్తి అదనపు బాధ్యతలు కూడా ఎవరికీ ఇవ్వలేదు.

ఈఎన్‌సీ, సీఈ, న్యాక్ డీజీ భర్తీ ఎప్పుడో!
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో రెండు కీలక పోస్టులు, ఇదే శాఖకు అనుబంధంగా ఉండే నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (న్యాక్)లో మరో ముఖ్యమైన పోస్టు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ ఎప్పుడన్నది తెలియడం లేదు. పూర్తి అదనపు బాధ్యతలు కూడా ఎవరికీ ఇవ్వలేదు. దాంతో ఆయా హోదాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలుస్తోంది. ఆర్ అండ్ బీలో ఇంజనీరు ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) పోస్టు కీలకం. వీటిలో ఈఎన్‌సీ అడ్మిన్ పోస్టులో ఉన్న అధికారే ఉద్యోగుల వ్యవహారాలు, బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ అంశాలతో పాటు శాఖ మొత్తాన్ని పర్యవేక్షిస్తారు. ఇటీవల ఈ పోస్టులో ఉన్న అధికారి పదవీ విరమణ చేశారు. కానీ ఇంతవరకూ మరో అధికారిని నియమించలేదు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ ఉన్న కారణంగానే ఆ పోస్టును భర్తీ చేయలేదని అధికారిక వర్గాలు అంటున్నాయి. కోడ్ ఉన్నప్పటికీ కొంతమంది అధికారుల పోస్టులను మార్చడంతో పాటు ఇతర విభాగాల బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆ సమయంలో ఈఎన్‌సీ పోస్టును భర్తీ చేయకపోవడంతో కారణం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది. మరోవైపు, ఆర్ అండ్ బీ శాఖలో జాతీయ రహదారుల విభాగం కూడా కీలకంగా ఉంది. కేంద్రం నుంచి మంజూరయ్యే ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదల్చిన జాతీయ స్థాయి పనులను ఈ విభాగమే పరిశీలిస్తుంది. ఈ విభాగం చీఫ్ ఇంజనీరు (సీఈ) పోస్టులో ఉన్న అధికారి కూడా ఇటీవల పదవీ విరమణ చేశారు. కానీ ఇప్పటివరకు భర్తీ చేయలేదు. కొంతమంది అధికారులకు కొన్ని విభాగాల బాధ్యతలు అప్పగించినా ఈ పోస్టును ఎవరికీ కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతున్న జాతీయ రహదారుల పనులపై పర్యవేక్షణ కొరవడిందనే ప్రచారం జరుగుతోంది. న్యాక్ డైరెక్టర్ జనరల్ పోస్టు కూడా ఖాళీగానే ఉండడం గమనార్హం. న్యాక్‌లో భవన, రహదారుల నిర్మాణంతో పాటు సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఈ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుంది. వీటిని పర్యవేక్షించడం, ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడంలో డీజీ పోస్టు కీలకం.