Guvvala Balraju: బీఆర్‌ఎసకు గువ్వల గుడ్‌బై
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:58 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు ఎదురు దెబ్బ తగిలింది. గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా.. కేసీఆర్‌కు లేఖ
9న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు
కమలంతో కారు కలువనుందనే ఈ నిర్ణయం
అదే బాటలో మర్రి, బీరం అంటూ ప్రచారం
ఖండించిన జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి
కాంగ్రె్‌సలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండబాల
హస్తంను వీడి బీజేపీలో చేరనున్న అబ్రహాం
హైదరాబాద్/మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూలు/ఖమ్మం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు ఎదురు దెబ్బ తగిలింది. గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. శనివారమే బాలరాజు తన రాజీనామా లేఖను పంపించినట్లు, అయితే ఆయనను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్ అదిష్ఠానం ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ, బాలరాజు మాత్రం తన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పినట్లు సమాచారం. కాగా, బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు, ఈ నెల 9న కాషాయ కండువా కప్పుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించగా.. రాజీనామాను ధ్రువీకరించడంతోపాటు అంబేడ్కరిజం, జాతీయవాద భావజాలం ఉన్న పార్టీలో చేరతానని అన్నారు. 2006లో బీఆర్‌ఎ్‌సలో చేరిన గువ్వల 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్‌గా కూడా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్‌ను ఆశించారు. కానీ, తనను కాదని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై బాలరాజు కొంతకాలంగా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడమో, విలీనం కావడమో జరుగుతుందనుందని వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే తన స్థానం గల్లంతవుతుందని బాలరాజు భావించినట్లు సమాచారం. అందుకే తానే ముందుగా బీజేపీలో చేరితే ఆ సమస్య ఉండదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బీఆర్‌ఎస్ కార్యకర్త ఒకరితో బాలరాజు జరిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. కాగా, బీఆర్‌ఎ్‌సకు గువ్వల రాజీనామా చేయడంతో ఆయన ప్రధాన అనుచరుడు పదర మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాంబాబుతోపాటు మరికొందరు నాయకులు కాంగ్రె్‌సలో చేరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.
గువ్వల బాటలో అబ్రహాం..
బీఆర్‌ఎ్‌సకు గువ్వల బాలరాజు రాజీనామా నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన నాగర్‌కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా గులాబీ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. వారిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా తాము బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగిన అబ్రహాం.. చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ చేరారు. హస్తం పార్టీ అభ్యర్థి సంపత్‌కుమార్ తరఫున ప్రచారం చేశారు. అయితే అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవగా, కాంగ్రె్‌సలో సంపత్ వర్గంతో అబ్రహాంకు పొసగడం లేదన్న ప్రచారం ఉంది. తాజా వార్తలపై అబ్రహాంను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. కాంగ్రెస్ పార్టీతో తన బంధం గత అసెంబ్లీ ఎన్నికల నాటితోనే తెగిపోయిందని అన్నారు. తాను అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే తీసుకోలేదన్నారు. బీజేపీలో చేరికకు సంబంధించి ఆ పార్టీ అధిష్ఠానం నుంచి, తన అనుచరుల నుంచి ఒత్తిళ్లు వస్తున్న మాట వాస్తవమేనన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన కొండబాల
ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పి కాంగ్రె్‌సలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కొండబాలతో పాటు మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా కాంగ్రె్‌సలో చేరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News