Share News

కేసీఆర్‌ను విచారించాకే కాళేశ్వరం నివేదిక!

ABN , Publish Date - May 20 , 2025 | 05:23 AM

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో కీలక భూమిక పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశాకే... జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ను విచారించాకే కాళేశ్వరం నివేదిక!

  • విచారించకుండా అభియోగాలు మోపడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్న అభిప్రాయం

  • కాళేశ్వరం విచారణలో కీలక మలుపు

  • విచారణ గడువు 2 నెలలు పొడిగింపు

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో కీలక భూమిక పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశాకే... జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెలాఖరున కమిషన్‌ గడువు ముగియనుంది. కేసీఆర్‌తో పాటు గత సర్కారులో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటలను విచారించకుండానే కమిషన్‌కు లభించిన పత్రాల ఆధారంగా వారి పాత్రను నిర్ధారిస్తూ నివేదికను వారం రోజుల్లోపు ఇవ్వాలని కమిషన్‌ యోచించింది. ఈనెల 22వ తేదీ తర్వాత నివేదిక ఇచ్చేయాలని కమిషన్‌ ఇదివరకే సంకేతాలిచ్చింది. కానీ ఆకస్మాత్తుగా కమిషన్‌ విచారణ గడువును జూలై 31 దాకా పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు. కాగా ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేస్తున్నప్పుడు... ఆ అభియోగాలపై సదరు వ్యక్తి సంజాయిషీ చెప్పుకోవడానికి అవకాశాలు ఇవ్వాలని సహజ న్యాయసూత్రాలు చెబుతున్నాయి. దాంతో ఆ న్యాయసూత్రాలను అనుసరించే కేసీఆర్‌ను విచారణకు పిలిచి, ఆయన అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని కమిషన్‌ యోచించినట్లు సమాచారం.


ఆ మేరకు కేసీఆర్‌కు కమిషన్‌ సమన్లు పంపించే అవకాశాలున్నాయని, పంపాక వారం రోజుల్లోపు హాజరుకావాలని కమిషన్‌ కోరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్లపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌ కూడా కేసీఆర్‌కు సమన్లు పంపించి, ‘మీ మీద ఫలానా వ్యక్తులు ఆరోపణలు చేశారు... వారిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయడానికి మీకు అవకాశం ఇస్తున్నాం’ అంటూ ఆయన సమన్లు పంపించారు. అయితే విచారణ పూర్తికాకుండానే దోషిగా ప్రకటించేలా జస్టిస్‌ నర్సింహారెడ్డి ప్రకటనలు చేశారంటూ కేసీఆర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు తెలిపి... ఆయన్ను విచారణ నుంచి తప్పించింది. ఈ క్రమంలో విద్యుత్తు విచారణ కమిషన్‌ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌.. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ నిర్మాణాలపై కేసీఆర్‌ సమర్థన ఇస్తూ రాసిన లేఖనే ఆయన అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 05:23 AM