Share News

KCR: కాంగ్రెస్‌ వైఫల్యాలపై ప్రెస్‌మీట్‌ పెడతా..

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:41 AM

ఒకటి, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతానని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్‌మీట్‌ పెడతానని బీఆర్‌ఎస్‌ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు.

KCR: కాంగ్రెస్‌ వైఫల్యాలపై ప్రెస్‌మీట్‌ పెడతా..
KCR

  • రైతు సమస్యలు, బనకచర్లపై వివరిస్తా

  • ఒకట్రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి బయటకొస్తా.. పార్టీ నాయకులతో కేసీఆర్‌

  • ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన యశోద ఆస్పత్రి వర్గాలు

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : ఒకటి, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతానని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్‌మీట్‌ పెడతానని బీఆర్‌ఎస్‌ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం సమస్యలు, ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాష్ట్రానికి కలిగే నష్టం సహా అనేక అంశాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తానని చెప్పినట్లు తెలిసింది. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఇతర ముఖ్యనేతలు పరామర్శించారు.


ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు వంటి ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై వారితో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు. కాగా, కేసీఆర్‌ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ పేర్కొన్నారు. బ్లడ్‌ షుగర్‌, సోడియం స్థాయిల పర్యవేక్షణ కోసం ఒకటి, రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మరోవైపు.. కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు యశోద ఆస్పత్రి వైద్య వర్గాలు తెలిపాయి.


కేసీఆర్‌ను పరామర్శించిన కవిత

యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. శుక్రవారం తెల్లవారు జామున ఒకసారి, ఆ తర్వాత మరోసారి ఆమె ఆస్పత్రికి వెళ్లి తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 09:51 AM