Share News

Yashoda Hospital: కేసీఆర్‌కు అస్వస్థత

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:08 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు.

Yashoda Hospital: కేసీఆర్‌కు అస్వస్థత

  • వారం నుంచి తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో ఇబ్బంది

  • యశోద ఆస్పత్రిలో చికిత్స కేసీఆర్‌

  • త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్‌, బండి సంజయ్‌ ఆకాంక్ష

హైదరాబాద్‌, సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి భవనం తొమ్మిదో అంతస్తుల్లోని ప్రత్యేక గదిలో ఆయనకు ఆస్పత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తొలుత కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌ నుంచి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సతీమణి శోభ, కేటీఆర్‌, శైలిమ, హరీశ్‌, సంతోష్‌తో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు కేసీఆర్‌కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు.


రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నట్లు, సోడియం లెవల్స్‌ తగ్గినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన మందులు ఇస్తున్నారు. ఇతర వైటల్‌ పారామీటర్స్‌ సాధారణంగానే ఉన్నాయని, కేసీఆర్‌ బలహీనంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్‌ ఎంవీరావు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆకాంక్షించారు.

Updated Date - Jul 04 , 2025 | 04:08 AM