Kavitha Suspension: కవిత సస్పెన్షన్ ఖాయం..!
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:55 AM
సొంత పార్టీకి చెందిన నేతలు హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్ కుమార్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది..
నేడో, రేపో బీఆర్‌ఎస్ నుంచి ప్రకటన!
కీలక నేతలతో అధినేత కేసీఆర్ సమావేశం
ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమనే అభిప్రాయం
ఎక్స్‌లో కవిత అన్‌ఫాలోకు ఆదేశాలు
సోషల్ మీడియా, టీవీ చర్చల్లో ఆమెపై దాడి
బీఆర్‌ఎ్‌సఎల్పీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పీఆర్వో అవుట్
బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైతే తెలంగాణ జాగృతి పేరుతో కవిత సొంత పార్టీ?
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సొంత పార్టీకి చెందిన నేతలు హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్ కుమార్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరిగేలోపే ఆమెను బీఆర్‌ఎస్ నుంచి సాగనంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ ఖాయం అనే ప్రచారం బీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో బీఆర్‌ఎస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో హరీశ్, సంతో్‌షపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశాక.. ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌ్‌సకు వెళ్లారు. అక్కడ కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరు కీలకనేతలు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌తో మంతనాలు జరిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కవిత పార్టీలో ఉంటే లాభం ఉందా? అంటూ పార్టీ నేతలను కేసీఆర్ ప్రశ్నించారు. ఇంత పెద్ద వ్యాఖ్యలు చేశాక కూడా కవితను కొనసాగిస్తే పార్టీకి మరింత నష్టం అని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మెజారిటీ నేతలు కేసీఆర్‌కు సూచించారు. కవితను పార్టీలో కొనసాగితే విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లేనని నేతలు అభిప్రాయపడ్డారు. కవితపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మున్ముందు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని అఽధినేతకు చెప్పారు. కవిత ఇదివరకే.. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. అప్పుడే ఆమెపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటేనే తక్కువ నష్టం జరుగుతుందనే భావన అప్పట్లో పార్టీ పెద్దల్లో ఉండిందని.. ఇప్పుడు చేయిదాటిపోయే స్థాయికి పరిస్థితి చేరిందని ఓ కీలక నేత చెప్పారు.
కవితపై బీఆర్‌ఎస్ నేతల మాటల దాడి
సామాజిక మాధ్యమాల్లో కవితను వెంటనే ఆన్‌ఫాలో కావాలని బీఆర్‌ఎస్ ఐటీ విభాగం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఆ వెంటనే ఎక్స్ ఖాతాలో కవితను ఫాలో అవుతున్న కార్యకర్తలు వెంటవెంటనే అన్‌ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఎలకా్ట్రనిక్ మీడియాలో బీఆర్‌ఎస్ తరఫున చర్చలకు వెళ్లిన నేతలు కూడా కవిత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కొందరైతే కవిత తీరు వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆరోపించారు. మరికొందరు తక్షణమే ఆమె పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ వాట్సప్ గ్రూప్ నుంచి కవిత పీఆర్వోను తొలగించారు. హరీశ్‌రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం పోస్టులు పెట్టింది. లండన్ పర్యటనలో ఉన్న హరీశ్‌రావుకు అక్కడి బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఘనస్వాగతం పలికింది.
సస్పెండ్ చేస్తే సొంతపార్టీ?
బీఆర్‌ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తే .ఆమె అడుగులు ఎటువైపు? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయుతే మొదట్నుంచి ఆమె ఒక స్పష్టతతో ఉన్నారని, పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సివస్తే, సొంత వేదిక ఏర్పాటు చేసుకోవాలని ముందే నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి ఆమె తన జాగృతి సంస్థను నెమ్మదిగా బలోపేతం చేస్తూ వస్తున్నారు. జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పెడితే తెలంగాణ జాగృతినే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కొత్త పేరు జోలికి వెళ్లకపోవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News