Share News

Kavitha: సొంత జిల్లాకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు: కవిత

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:43 PM

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో పెట్టినా.. రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని కవిత పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్‌ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ నుంచి తీసేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు.

Kavitha: సొంత జిల్లాకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు: కవిత
Kavitha

జడ్చర్ల, అక్టోబర్ 28: సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను సందర్శించి కవిత మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారని.. జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని క్షమించరని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో పెట్టినా.. రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్‌ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ లోంచి తీసేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.


జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినట్లు తెలిపారు కవిత. మహబూబ్ నగర్ జిల్లాకు నీరిచ్చే వరప్రదాయని కృష్ణానది అని కొనియాడారు. తెలంగాణ సిద్దించిన తర్వాత అలాంటి కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవటం జరిగిందని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి అయ్యాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా సరే ప్రాజెక్ట్ ఒక్క అడుగూ ముందుకుపడలేదని విమర్శించారు. ఉదండాపూర్, కరివెనలో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్లపూర్- ఏదుల టన్నెల్ పనులను చేయటం లేదన్నారు. ఒక పక్క ఉన్న నీళ్లను వాడుకోవటం లేదని.. మరో పక్క ఆల్మట్టి ఎత్తు పెంచితే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. తక్షణమే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి:

Kishan Reddy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

HYDRAA: కబ్జాల చెర వీడిన 1.27 ఎకరాల పార్క్.. హైడ్రా విముక్తి

Updated Date - Oct 28 , 2025 | 07:15 PM